
హైదరాబాద్: హైదరాబాద్లో మరో భారీ కల్తీ దందా వెలుగులోకి వచ్చింది. కొంత మంది టీ షాప్ ఓనర్స్ వాడిన టీ పౌడర్లో రంగులు కలిపి మళ్లీ వాడుతున్నట్లు పోలీసుల సీక్రెట్ ఆపరేషన్లో నిజం బయటపడింది. సుమారు 4 టన్నుల కల్తీ టీ పౌడర్కి సంబంధించిన పదార్థాలను అధికారులు గుర్తించారు.
H- FAST పోలీసుల సీక్రెట్ ఆపరేషన్లో ఈ కల్తీ దందా గుట్టు రట్టయింది. పోలీసులు పది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. H- FAST ఏర్పడిన తర్వాత హైదరాబాద్ సిటీలో కల్తీ దందా భారీగా బయటపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే 14 టన్నుల కల్తీ మటన్ను అధికారులు గుర్తించి సీజ్ చేశారు.
టాస్క్‌ఫోర్స్, ఫుడ్‌సేఫ్టీ, జీహెచ్‌ఎంసీ డిపార్ట్‌మెంట్లతో కలిపి హెచ్ ఫాస్ట్ (హైదరాబాద్ఫుడ్అడల్ట్రేషన్సర్వైలైన్స్టీమ్) ఏర్పాటు చేశారు. ఈ టీమ్మార్చి 19 నుంచి సిటీలోని పలుచోట్ల తనిఖీలు చేసి 62వేల టన్నుల కల్తీ ఆహార పదార్థాలను సీజ్ చేసింది. 92 కేసులు నమోదు చేసి, 98 మంది కల్తీరాయుళ్లను కటకటాల్లోకి నెట్టింది. కాగా, హెచ్ ఫాస్ట్ హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధికే పరిమితం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి కాల్స్వస్తున్నా స్పందించలేని పరిస్థితి. దీంతో జిల్లా కేంద్రాల్లోనూ ఇలాంటి సంస్థలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతున్నది.
►ALSO READ | పల్నాడు ఎక్స్ప్రెస్లో 25 కేజీల గంజాయి.. వికారాబాద్ జిల్లాలో ముగ్గురు అరెస్ట్
కల్తీఫుడ్‌లో హైదరాబాదే నంబర్‌వన్‌గా ఉండటం శోచనీయం. ఉమ్మడి ఏపీ నుంచి ఇదే పరిస్థితి. 1995 నుంచి -1999 మధ్య కాలంలో అధికారులు జరిపిన దాడుల్లో 4,455 ఆహార నమూనాలు కల్తీవని తేలాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2022 రిపోర్ట్స్ప్రకారం దేశంలోని 19 ప్రధాన నగరాల్లో ఆహార కల్తీలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. 2022లో దేశవ్యాప్తంగా నమోదైన 291 కేసుల్లో 246 కేసులు మన భాగ్యనగరంలోనే ఉన్నాయ్యాయంటే ఆశ్చర్యం కలగక మానదు.
పసి పిల్లలు తాగే పాల నుంచి టీలో వాడే చాయ్ పత్త దాకా.. కూరల్లో వాడే నూనె మొదలు కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ దాకా .. ఇలా ‘కాదేదీ కల్తీకనర్హం’ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. వేడి వేడి అన్నంలో వేసుకుని తినే పచ్చడి, అందులో పోసుకునే నెయ్యి, చిన్నారులు ఇష్టంగా తినే ఐస్‌క్రీమ్స్, కిరాణా షాపుల్లో దొరికే తినుబండారాలు.. హోటళ్లలో తాగే చాయ్, అందులో ముంచుకు తినే ఉస్మానియా బిస్కెట్స్.. ఇలా ఒక్కటేమిటి సర్వం కల్తీనే.