
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీలోని ఐఆర్ఎస్ అధికారి కుమార్తె హత్య కేసులో పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బుధవారం ఉదయం ఐఆర్ఎస్ అధికారి కుమార్తె(22)ను 19 ఏళ్ల రాహుల్ మీనా అత్యంత దారుణంగా హతమార్చాడు. అదేరోజు ద్వారకా ప్రాంతంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా పోలీసుల దర్యాప్తులో నిందితుడు చెప్పిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘‘అగర్ దీదీ పైసే దే దేతీ తో ఐసా నహీ హోతా (అక్క డబ్బు ఇచ్చి ఉంటే ఇది జరిగి ఉండేది కాదు)..’’.. గతంలో ఇదే ఇంట్లో పనిమనిషిగా పని చేశాడు. దీంతో యువతిని అక్క అని పిలిచేవాడని తెలుస్తోంది. అయితే ఆరోజు ‘‘అలా జరిగిపోయింది.’’ అని పదేపదే పోలీసులకు చెప్పాడు. అక్కను అసలు చంపాలని అనుకోలేదని.. కాకపోతే అలా జరిగిపోయిందని రాహుల్ మీనా పోలీసులకు చెప్పుకొచ్చాడు. తాను కేవలం డబ్బు కోసం మాత్రమే లోపలికి వెళ్లానని.. చంపే ఉద్దేశం అసలు లేదని తెలిపాడు. స్టడీ రూమ్‌లోకి వెళ్లగానే అక్క ఎందుకు వచ్చావని అడిగిందని.. ‘‘ఆంటీ నన్ను పని కోసం పిలిచారు.’’ అని చెప్పినట్లుగా తెలిపాడు. వెంటనే డబ్బు కావాలని అడిగితే ఇచ్చేందుకు నిరాకరించిందని.. ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని.. కోపంతో ల్యాంప్‌తో దాడి చేసి మొబైల్ కేబుల్‌తో గొంతు నులిమి చంపినట్లుగా వాంగ్మూలం ఇచ్చాడు.
నిందితుడు రాహుల్ మీనా రాజస్థాన్‌లోని అల్వాల్‌లో లూడో గేమ్ ఆడే స్నేహితుడితో పెళ్లికి వెళ్లాడు. అదేరోజు రాత్రి ఒంటరిగా గ్రామానికి వచ్చి స్నేహితుడి భార్యపై బలవంతంగా అత్యాచారం చేశాడు. మొబైల్ దొంగిలించి.. అనుమానం రాకుండా మరో రెండు ఫోన్లతో విక్రయించి.. ఆ డబ్బుతో క్యాబ్ బుక్ చేసుకుని ఢిల్లీకి వచ్చాడు. బుధవారం ఉదయం ఐఆర్ఎస్ అధికారి తన భార్యతో కలిసి జిమ్‌కి వెళ్లిపోగానే.. అదనపు తాళంతో ఇంట్లోకి ప్రవేశించాడు. నేరుగా స్టడీ రూమ్‌లోకి వెళ్లగా.. యువతిపై దాడి చేసి అత్యాచారం చేసినట్లుగా పోలీసులు తెలిపారు. అత్యాచారం జరిగిందా? లేదా? అన్నదానిపై శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించారు. అంతేకాకుండా నిందితుడిని నాలుగు రోజులు కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది. విచారణంలో నిందితుడి డీఎన్‌ఏను సేకరించనున్నారు. ఈ రెండు ఘటనలేనా? ఇంకేమైనా ఉన్నాయా? అన్నదానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.