
దేశవ్యాప్తంగా మీడియా ప్రతినిధులు ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలపై చర్చించేందుకు హైదరాబాద్ వేదిక కావడం శుభపరిణామమని కొనియాడారు మంత్రి వివేక్ వెంకటస్వామి.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఎగ్జిక్యూటివ్ సమ్మిట్ ను మంత్రి వివేక్ ప్రారంభించారు. రెండు రోజుల పాటు సాగే ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు దేశంలోని 26 రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో మీడియా ప్రతినిధులు తరలివచ్చారు.
ఈ సందర్బంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో మీడియా అనేది నాల్గవ స్తంభమని, సమాజాన్ని చైతన్యపరచడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన ప్రశంసించారు. నేటి కాలంలో జర్నలిస్టులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనేది వాస్తవమేనని మంత్రి వివేక్ అన్నారు. అయితే జర్నలిస్టుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. త్వరలోనే రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ తెలంగాణ ప్రభుత్వం అక్రిడేషన్ కార్డులను అందజేస్తుందని ప్రకటించారు.అక్రిడేషన్లతో పాటు భవిష్యత్తులో జర్నలిస్టులకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తామని, విధి నిర్వహణలో వారికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.