
కంచన్ బాగ్ డీఆర్డీవో అపోలో ఆసుపత్రి ఎదట తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిరసనకు దిగారు. డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ను పరామర్శించేందుకు ఏప్రిల్ 23న రాత్రి కవిత ఆస్పత్రి దగ్గరకు వెళ్లారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన కవితను, జాగృతి కార్యకర్తలను ఆస్పత్రి బయట పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కవితకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా కంచన్ బాగ్ డీఆర్డీవో అపోలో ఆస్పత్రి ఎదుట కవిత నిరసన తెలిపారు. అనంతరం కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శంకర్ గౌడ్ మృతి
ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ గురువారం అర్థరాత్రి 2.30 గంటలకు మృతి చెందారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా శంకర్ గౌడ్ నిప్పంటించుకొని ఆత్మహత్యా యత్నం చేయడంతో మొదట వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలించారు. హుటాహుటిన కంచన్ బాగ్ DRDO అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో శంకర్ మృతిచెందాడు. శంకర్ గౌడ్ మృతితో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేసేందుకు పిలుపునిచ్చారు.