Reading Time: < 1 minute
Harmanpreet Kaur Breaks Record Becomes Highest Run Scorer As Captain In Womens T20is

Harmanpreet Kaur: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ప్రదర్శనతో ప్రపంచ రికార్డు సృష్టించింది. జోహన్నెస్‌ బర్గ్‌ లో జరిగిన ఈ మ్యాచ్‌ లో హర్మన్‌ప్రీత్ కౌర్ కేవలం 38 బంతుల్లో 66 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోర్ అందించింది. ఆమెతో పాటు ఓపెనర్ షఫాలి వర్మ 64 పరుగులు చేయగా, స్మృతి మంధానా 37 పరుగులతో సహకరించింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 192 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.

ఈ మ్యాచ్‌లో సాధించిన అర్ధసెంచరీతో హర్మన్‌ప్రీత్ కౌర్ మహిళల టీ20ల్లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన మహిళా కెప్టెన్ గా నిలిచింది. ఇప్పటివరకు ఈ రికార్డు 3016 పరుగులతో చమరి అథపత్తు పేరిట ఉండగా, ఇప్పుడు హర్మన్‌ప్రీత్ 3017 పరుగులతో ఆమెను అధిగమించి మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మెగ్ లానింగ్ 2619 పరుగులతో మూడో స్థానంలో ఉంది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే భారత్ ఇచ్చిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన దక్షిణాఫ్రికా జట్టు సునాయాసంగా విజయం సాధించింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ అద్భుత బ్యాటింగ్‌తో 115 పరుగులు చేసి భారత్ బౌలర్లపై దండయాత్ర చేసింది. దీంతో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 3-0తో సిరీస్ ను కోల్పోయింది. ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ఇంకా రెండు నెలలు మాత్రమే ఉండగా.. ప్రస్తుతం జట్టు ప్రదర్శన ఆందోళన కలిగిస్తోంది. బ్యాటింగ్‌లో కొంత మెరుగుదల కనిపించినప్పటికీ, బౌలింగ్ విభాగం మాత్రం నిరాశపరుస్తోంది.

ముఖ్యంగా ప్రధాన బౌలర్ రేణుక సింగ్ ఠాకూర్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. అలాగే దీప్తి శర్మ కూడా ఎక్కువ పరుగులు ఇస్తోంది. అయితే యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ మాత్రం సిరీస్‌లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది.