Reading Time: 3 minutes
Vaazha 2 Movie Telugu Review Rating Hashir Savin Sa Sahu Garapati Malayalam Hit

మలయాళంలో ఏప్రిల్ రెండవ తేదీన విడుదలై, ఇప్పటికీ 200 కోట్ల రూపాయల కలెక్షన్స్ దాటిన ‘వాలా 2’ సినిమాని అదే పేరుతో తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఆసక్తికరంగా తెలుగు నిర్మాత సాహు గారపాటి ఈ సినిమాని మలయాళంలో కూడా నిర్మించారు, ఆయనే దీన్ని తెలుగులో కూడా రిలీజ్ చేశారు. నిజానికి ‘వాలా’ అనే సినిమా గతంలో ఓటీడీలో చూసిన తెలుగు ప్రేక్షకులకు, ఈ సినిమా దానికి సీక్వెల్ (కొనసాగింపు) అనుకుంటారు. కానీ అదేమీ లేదు. విపిన్ దాస్ అందించిన కథను దర్శకుడు ఎలా తెరకెక్కించాడు? తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా డబ్బింగ్ కుదిరిందా లేదా అనేది ఇప్పుడు ‘వాలా 2’ రివ్యూలో తెలుసుకుందాం.

వాలా 2 కథ:
పక్కపక్క ఇళ్లలో ఉండే హషీర్, అలన్ ఇద్దరూ చిన్ననాటి నుంచి స్నేహితులు. అయితే అలన్ చెల్లెల్ని ప్రేమించిన అజిన్ తో, అతని అన్న స్నేహితుడు వినాయక్ తో వారికి గొడవవుతుంది, కానీ ఆ గొడవ కొద్ది రోజుల్లోనే స్నేహంగా మారుతుంది. వీరందరూ ఊరిలో సరదాగా తిరుగుతూ చదువుకుంటూ ఉన్న క్రమంలో, వీరు చదివే స్కూల్లో కొంతమంది పిల్లలు స్కూల్‌కి రాకుండా సినిమాలకు వెళుతున్నారని, క్లాసులో ఫోన్లు వాడుతున్నారని యాజమాన్యానికి తెలుస్తుంది. ఈ క్రమంలోనే హషీర్, అలన్ ఇద్దరూ వేర్వేరు అమ్మాయిలను ప్రేమిస్తున్న విషయం కూడా స్కూల్లో తెలుస్తుంది. దానికి తోడు అలన్ చెల్లెలు స్కూల్‌కి రాకుండా థియేటర్‌కు వెళ్లిన విషయం కూడా బయటపడుతుంది. అయితే ఆ స్కూల్లో పనిచేస్తున్న ముజీబ్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని, వారి తల్లిదండ్రులను అందరి ముందు అవమానిస్తాడు. అయితే అనుకోకుండా అదే సమయానికి డ్రగ్స్ తీసుకున్న నలుగురు స్నేహితులు ఏం చేశారు? అల్లరి చిల్లరగా తిరిగే వీరందరూ జీవితంలో సెటిల్ అయ్యారా? యూకేకి వెళ్లి చదువుకోవాలన్న వీరి ఆశ తీరిందా? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:
నిజానికి మొదటి ‘వాలా’ సినిమాకి, ఈ రెండో ‘వాలా 2’ సినిమాకి కథాపరంగా పెద్దగా కొనసాగింపు ఏమీ లేదు. ‘వాలా’ సినిమా చివరిలో నలుగురు కుర్రాళ్ల పాత్రలను చూపిస్తారు. వీరందరూ యూకేకి వెళ్లి చదువుకోవాలని భావిస్తున్నట్లుగా అప్పట్లో చూపించారు. ఆ నలుగురు కుర్రాళ్లనే ప్రధాన పాత్రధారులుగా ఈ ‘వాలా 2’ని తెరకెక్కించారు దర్శక నిర్మాతలు. సినిమా ప్రారంభం నుంచి హషీర్, అలన్ బాల్యం మొదలు, వారిద్దరూ పెరిగి పెద్దయ్యే వరకు ఆసక్తికరంగా చూపించారు. ఆ తర్వాత స్కూల్లో ఎప్పటిలాగే గొడవలు ఇలా సరదాగా సాగిపోతూ ఉంటుంది. అయితే థియేటర్లో పోలీసు అధికారితో వచ్చే ఒక సీన్‌తో పాటు, అలన్ సున్తీ సీన్ అయితే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేలా రాసుకున్నాడు దర్శకుడు. మలయాళం సినిమా ఒకలా ఉంటే, తెలుగులో దాన్ని డబ్బింగ్ చేసే విషయంలో మాత్రం పూర్తిగా స్వేచ్ఛ తీసుకున్నట్లు అనిపించింది. మలయాళంలో ఎలాంటి మీమ్ రిఫరెన్స్‌లు ఉండవు, కానీ అక్కడ నవ్వు పుడుతుంది. తెలుగులో మాత్రం ఎన్నో మీమ్ రిఫరెన్స్‌లు పెట్టి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే ప్రయత్నం చేశారు. చాలా వరకు అందులో సక్సెస్ అయ్యారు కూడా.

నిజానికి ఫస్టాఫ్ అంతా కూడా సరదా సరదాగానే సాగిపోతుంది. “ఇదేంట్రా ఇంతేనా? ఇలాంటి సినిమాకి వందల కోట్లు ఎలా వచ్చాయి?” అని ప్రేక్షకులు ఆలోచిస్తూ ఉండగానే సెకండ్ హాఫ్ మొదలవుతుంది. సెకండ్ హాఫ్ మొదలయ్యాక పూర్తిగా ఎమోషనల్‌గా సినిమాని నడిపించే ప్రయత్నం చేశారు. నలుగురు కుర్రాళ్ళలో ఒకరు దుబాయ్‌లో డబ్బు సంపాదించాలని వెళితే, మరో ఇద్దరు మాత్రం యూకే వెళ్లి అక్కడ చదువుకుంటూ, జాబ్ చేసి ఊర్లో అందరి నోళ్లు మూయించాలని భావిస్తారు. సబ్జెక్టులు మిగిలిపోయిన మరో కుర్రాడు మాత్రం ఊరిలోనే ఉండిపోయి, వారి దగ్గరకు వెళ్లాలని తాపత్రయపడుతూ ఉంటాడు.
ఈ క్రమంలో వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి అనేది ఆసక్తికరంగా చూపించారు. “దూరపు కొండలు నునుపు” అని మనందరం అనుకున్నట్టుగానే.. యూకే వెళ్లిన ఇద్దరూ కనీసం కలుసుకోవడానికి కూడా వీలు లేకుండా, చిరక ఆరు మైళ్ళు నడిచి వెళ్లి కలుసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడడం, దుబాయ్ వెళ్లిన వ్యక్తి ఎండలో కమిలిపోతూ పని చేసుకోవడం చూపించగా.. వారి తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఇక్కడ ఉండిపోయిన కుర్రాడు చిన్నా చితకా పనులు చేస్తూ ఉండడం చూపించారు.

నిజానికి ఇది ఒక సోషల్ సెటైర్ లాగానే అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా అప్పు చేసైనా తమ పిల్లల్ని విదేశాలకు పంపించాలని తాపత్రయపడుతున్నారు. కానీ అక్కడికి వెళ్ళాక వచ్చే ఇబ్బందులు, కనీసం మనుషులు చనిపోతే కూడా చూసుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనేది ఎవరూ కాదనలేని సత్యం. కాబట్టి “పరిగెత్తి పాలు తాగే కన్నా, అయిన వారి దగ్గరే ఉండి నిలబడి నీళ్లు తాగాలి” అనే ఒక మెసేజ్ ఇచ్చేలా ఈ సినిమాను రాసుకున్నాడు దర్శకుడు.
ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడంలో బాగా సక్సెస్ అయ్యింది. ప్రతి మిడిల్ క్లాస్ వ్యక్తి ఈ సినిమాలో ఏదో ఒక చోట తనను తాను చూసుకొని రిలేట్ అయ్యేలా ఈ సినిమా కథ ఉంటుంది. ఏదో ఒక సీన్లో తనను, తనకు తెలిసిన వారిని చూసుకొని బాధపడటం, ఆలోచించడం లేక నవ్వుకోవడమో కచ్చితంగా జరుగుతుంది. ముఖ్యంగా అన్నదమ్ములు ఉన్న వారైతే కంటతడి పెట్టించే సీన్స్ కొన్ని రాసుకున్నాడు రచయిత. చిన్న చిన్న పంతాలకు పోయి ఇప్పటికీ మాట్లాడుకోకుండా ఉండిపోయిన అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఉన్నారు. వారందరూ ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే వారి వారి అన్నలకు, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు ఫోన్ చేసి మాట్లాడుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సరదాగా ఓ కామెడీ సినిమా చూద్దామని వెళ్లిన ప్రతి ఒక్కరికి, ఈ సినిమా నవ్విస్తూ, ఆలోచింపజేస్తూ, గుండెల్ని తడుముతూ బయటకు పంపుతుంది.

నటీనటులు & సాంకేతిక నిపుణులు:
హషీర్, అలన్, అజిన్, వినాయక్.. వీరందరూ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకున్న వారే. ‘వాలా’ మొదటి భాగం చివరిలో కనిపించిన వీరు, ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులుగా నటించారు. వీరు నటించినట్లు అనిపించదు, నిజ జీవిత పాత్రలలో జీవించినట్లు అనిపిస్తుంది. ఇక వీరి తండ్రులు, తల్లుల పాత్రలలో నటించిన వారు సైతం ప్రొఫెషనల్ యాక్టర్స్‌కి ఏమాత్రం తక్కువ కాదని అనిపించారు. వారు మరీ నోటెడ్ ఫేసెస్ కాకపోయినా, ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో నటించి మెప్పించారు. ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్.. ‘వాలా’ మొదటి భాగంలో కనిపించిన వారందరూ చివరిలో మెరవడం.

టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, ఈ సినిమాకి సంగీతం మరో ప్రాణం. ఒకపక్క నేపథ్య సంగీతంతో సినిమాని వేరే లెవల్‌కి తీసుకువెళుతూనే, తెలుగు వారు సైతం కనెక్ట్ అయ్యేలా సాంగ్స్ ఉండడం మరో ప్లస్ పాయింట్.

ప్లస్ పాయింట్స్:
యూత్ ఫుల్ కంటెంట్: ఈ తరం యువతకు, ముఖ్యంగా మిడిల్ క్లాస్ అబ్బాయిలకు ఈ సినిమా పక్కాగా కనెక్ట్ అవుతుంది.
కామెడీ & ఎమోషన్: సహజ సిద్ధమైన హాస్యం మరియు క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్ సినిమాకు హైలైట్.
డబ్బింగ్: తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మీమ్ రిఫరెన్స్‌లను వాడటం చాలా బాగుంది.

మైనస్ పాయింట్స్:
సెకండాఫ్‌లో కొన్ని సీన్లు కాస్త సాగతీసినట్లు అనిపిస్తాయి.
మలయాళ నటులు కావడంతో కొందరికి ముఖ పరిచయం లేకపోవడం చిన్న వెలితి.

ఫైనల్లీ: ఇది ‘బిలియన్ బాయ్స్’ బయోపిక్.. అంటే నాది, నీది, మనందరిదీ!