Reading Time: < 1 minute
మీ ఒరిజినల్ సర్టిఫికెట్లు కాలేజీ వాళ్లు అట్టిపెట్టుకున్నారా..? ఇలా చేస్తే క్షణాల్లో తిరిగి ఇంటికొస్తాయ్

విద్యాసంస్థలు విజ్ఞానాన్ని పంచే దేవాలయాలు కావాలి. కానీ నేటి కాలంలో కొన్ని ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులను తమ చెప్పుచేతల్లో ఉంచుకునే వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా అడ్మిషన్ల సమయంలో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకుని, కోర్సు మధ్యలో మారాలనుకున్నా లేదా ఇతర కారణాల వల్ల వెళ్లాలనుకున్నా వాటిని తిరిగి ఇవ్వకుండా వేధించడం ఒక ప్రధాన సమస్యగా మారింది. అయితే, ఇలా సర్టిఫికెట్లను అట్టిపెట్టుకోవడం చట్టరీత్యా నేరమని చాలామందికి తెలియదు.

హైకోర్టు అడ్వకేట్ రవి కొండూరు ప్రకారం.. ఇంజనీరింగ్, మెడికల్ లేదా ఏదైనా వృత్తి విద్యా కోర్సుల్లో చేరేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్లను కాలేజీ కస్టడీలో ఉంచుకోవడం చట్టవిరుద్ధం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) 2018 మార్గదర్శకాల ప్రకారం, కళాశాలలు కేవలం ధృవీకరణ కోసం మాత్రమే అసలు పత్రాలను చూడాలి. అడ్మిషన్ రికార్డుల కోసం కేవలం స్వీయ-ధృవీకరించిన (Self-attested) జిరాక్స్ కాపీలను మాత్రమే ఉంచుకోవాలి. విద్యార్థులు వేరే మంచి అవకాశం వస్తే వెళ్ళిపోతారనే భయంతో, వారిని బంధించడానికి కళాశాలలు ఈ అక్రమ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి.

ఒకవేళ మీ సర్టిఫికెట్లను కళాశాల యాజమాన్యం తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తే, విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదు. ముందుగా కళాశాల అనుబంధంగా ఉన్న యూనివర్సిటీ హెడ్‌కు ఫిర్యాదు చేయాలి. అక్కడ ఫలితం లేకపోతే నేరుగా UGCకి ఆన్‌లైన్ లేదా మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. నిబంధనలు ఉల్లంఘించే కళాశాలలపై గుర్తింపు రద్దు చేయడం, గ్రాంట్లు నిలిపివేయడం వంటి కఠిన చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. అవగాహన లోపం వల్ల చాలా మంది తల్లిదండ్రులు కాలేజీల వేధింపులకు లొంగిపోతున్నారు. చట్టంపై అవగాహన కలిగి ఉండటం, ధైర్యంగా ఫిర్యాదు చేయడం ద్వారా మీ హక్కులను కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది చదవండి: ప్రామిసరీ నోటు ఉన్నా డబ్బులు ఎగ్గొట్టారా.? ఈ ఒక్క పని చేస్తే చాలు ఇంటికి తిరిగొస్తాయ్..