Reading Time: < 1 minute

‘నరక కూపం’ పోస్టుపై భారత్ సీరియస్.. ట్రంప్ మాటలు అవాస్తవం, అసహ్యకరం: విదేశాంగ శాఖ

Caption of Image.

పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం విషయం గురించి డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద సోషల్ మీడియా పోస్ట్‌పై భారత విదేశాంగ శాఖ అత్యంత ఘాటుగా స్పందించింది. భారతీయులను కించపరిచేలా ఉన్న ఆ వ్యాఖ్యలు “అవాస్తవం, అనుచితం.. అసహ్యకరమైనవి” అని భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

అమెరికన్ పొలిటికల్ కామెంటేటర్ మైఖేల్ సావేజ్ తన ‘సావేజ్ నేషన్’ పాడ్‌కాస్ట్‌లో భారత్, చైనా నుంచి వచ్చే వలసదారులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారిని ల్యాప్‌టాప్‌లు పట్టుకున్న గ్యాంగ్‌స్టర్లు అని, వారు అమెరికా జెండాను అవమానించారని ఆరోపించిన సంగతి తెలిసిందే. భారత్, చైనా వంటి దేశాలను “నరక కూపాలు” గా అభివర్ణిస్తూ.. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ చట్టాన్ని ఈ రెండు దేశాల ప్రజలు దుర్వినియోగం చేస్తున్నారని సావేజ్ అన్నారు. ఈ వివాదాస్పద పోస్ట్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రీపోస్ట్ చేయడంతో దుమారం చలరేగింది.

భారత్ ధీటైన సమాధానం..
ట్రంప్ షేర్ చేసిన పోస్టులోని ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. ఇవి పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రయోజనాలపై ఆధారపడిన భారత్-అమెరికా సంబంధాల వాస్తవికతను ప్రతిబింబించటం లేదని స్పష్టం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వ్యవహారంపై మండిపడింది. ఇది ప్రతి భారతీయుడిని గాయపరిచేలా ఉందని, ప్రధాని మోడీ వెంటనే ట్రంప్‌తో మాట్లాడి నిరసన తెలపాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ.

నష్టనివారణలో అమెరికా ఎంబసీ..
ట్రంప్ పోస్ట్ వల్ల భారత్‌లో వెల్లువెత్తిన ఆగ్రహాన్ని గమనించిన ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వెంటనే రంగంలోకి దిగింది. భారత్ ఒక గొప్ప దేశం.. అక్కడ తమ అత్యంత సన్నిహిత మిత్రుడు మోడీ అధికారంలో ఉన్నారు అని ట్రంప్ గతంలో అన్నట్లుగా పేర్కొంటూ నష్టనివారణ చర్యలు చేపట్టింది. అయితే ట్రంప్ ఈ వ్యాఖ్యలు ఎప్పుడు.. ఎక్కడ, ఏ సందర్భంలో చేశారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. మొత్తానికి అమెరికా అధ్యక్షుడి స్థాయిలో ఉన్న ట్రంప్.. భారతీయులను కించపరిచే పోస్ట్‌ను షేర్ చేయడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

©️ VIL Media Pvt Ltd.