
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల భవిష్యత్తుపై చర్చలు జోరందుకున్నాయి. తాజాగా ఏఐ సంస్థ ఆంత్రోపిక్ నిర్వహించిన అధ్యయనంలో ఒక విస్తుపోయే నిజం బయటపడింది. సాధారణంగా ఏఐ వల్ల టీచర్లు లేదా ఇతర వృత్తుల వారు భయపడుతున్నారని మనం అనుకుంటాం. కానీ అసలు విషయం ఏమిటంటే.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే ఏఐ వల్ల తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయోనని అత్యధికంగా ఆందోళన చెందుతున్నారంట.
క్లాడ్ యూజర్లపై ఆంత్రోపిక్ సర్వే..
సుమారు 81వేల మంది క్లాడ్ యూజర్లపై ఆంత్రోపిక్ ఈ సర్వే నిర్వహించింది. ఇందులో ప్రతి 10 మందిలో ఇద్దరు.. ఏఐ వల్ల తమ ఆర్థిక స్థితిగతులు దెబ్బతింటాయని, ఉద్యోగాల పోతుందని భయపడుతున్నట్లు తేలింది. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతో పోలిస్తే.. కోడింగ్ అండ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ రంగంలో ఉన్నవారే ఎక్కువగా ఈ భయం కారణంగా ఒత్తిడికి లోనవుతున్నారు.
టెక్కీల భయానికి కారణం ఇదే..
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఎక్కువగా ఏఐని కోడింగ్ పనుల కోసం ఉపయోగిస్తున్నారు. ఏఐ చాట్‌బాట్‌లు అత్యంత వేగంగా, కచ్చితత్వంతో కోడింగ్ రాస్తుండటంతో.. భవిష్యత్తులో తమ అవసరం తగ్గుతుందేమోనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ లాంటి కంపెనీలు కూడా 60 శాతం కోడింగ్ ఏఐ చేసిపెడుతోందని చెబుతున్న వేళ ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సీనియర్ల కంటే కెరీర్ ప్రారంభంలో ఉన్న యువ టెక్కీలే ఈ జాబ్ డిస్‌ప్లేస్‌మెంట్ గురించి ఎక్కువగా భయపడుతున్నారు.
ఈ సర్వేలో పాల్గొన్న వారు ఏఐ వల్ల తమ పనితీరు గణనీయంగా పెరిగిందని అంగీకరించారు. కేవలం 60 శాతం మంది యువ ఉద్యోగులు మాత్రమే తాము వ్యక్తిగతంగా లబ్ధి పొందుతున్నామని చెప్పారు. మిగిలిన వారు మాత్రం ఏఐ వల్ల యాజమాన్యాలకే ఎక్కువ లాభం ఉంటుందని, తమపై పని భారం మరింత పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. సాఫ్ట్‌వేర్ డెవలపర్లు మరియు కస్టమర్ సర్వీస్ ప్రతినిధులు ఏఐ వల్ల పని వేగం పెరిగిందని చెబుతుండగా, శాస్త్రవేత్తలు మరియు లాయర్లు మాత్రం ఇందులో పెద్దగా మార్పు లేదని తేల్చి చెప్పారు.
ఏఐ వల్ల పని వేగం పెరగడం, కొత్త కొత్త పనులు చేయగలిగే సామర్థ్యం రావడం వంటి సానుకూల అంశాలు ఉన్నప్పటికీ, ఉద్యోగ భద్రత విషయంలో మాత్రం టెక్కీలలో నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఆంత్రోపిక్’ ప్రతి నెలా ఒక ‘ఎకనామిక్ ఇండెక్స్ సర్వే’ను నిర్వహించి, ఏఐ వల్ల మారుతున్న ఉద్యోగ పరిస్థితులపై నిరంతరం నిఘా ఉంచాలని నిర్ణయించుకుంది. మొత్తానికి ఏఐ సృష్టించిన ఈ టెన్షన్ సాఫ్ట్‌వేర్ రంగంలో కొత్త చర్చకు దారితీస్తోంది.