Reading Time: < 1 minute
Elephant Rampage In Chandragiri Farmers Suffer Heavy Crop Loss In Tirupati

తిరుపతి జిల్లా చంద్రగిరి పరిధిలో గజరాజుల సంచారం భయానకంగా మారింది. గత నెల రోజులుగా గ్రామాలు వణికిపోతుండగా.. రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రాత్రివేళల్లో గ్రామాలపై దాడి చేస్తున్న ఏనుగుల గుంపులు పంటలను నాశనం చేస్తూ అన్నదాతలను కన్నీరుమున్నీరుగా మారుస్తున్నాయి. చేతికొచ్చిన పంట నోటికందకుండా పోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల రాత్రి సమయంలో మామిడి తోటలపై పడిన ఏనుగుల గుంపు కోతకు సిద్ధంగా ఉన్న కాయలను పూర్తిగా నేలమట్టం చేసింది. నెలల తరబడి శ్రమించి పెంచుకున్న పంటలు క్షణాల్లో నాశనం కావడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో నిలిచిపోయారు. పంటలతో పాటు సాగునీటి వ్యవస్థలపైనా గజరాజులు పంజా విసురుతున్నాయి. కూచివారిపల్లిలో రైతు సురేంద్ర నాయుడు బోరుబావిని ఏనుగులు ధ్వంసం చేయడంతో పరిస్థితి మరింత విషమించింది. మోటార్ పైపులు పూర్తిగా విరిగిపోగా.. పైపులు బోరుబావిలోకి పడిపోయాయి. దీంతో మిగిలిన పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయి. ఈ ఘటనతో లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతున్నారు.

ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నప్పటికీ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించడంతో పాటు ఏనుగుల సంచారాన్ని అరికట్టే చర్యలు చేపట్టాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రగిరి ప్రాంతంలో గజరాజుల భయం రైతులను, గ్రామస్థులను తీవ్రంగా కలవరపెడుతోంది.