Reading Time: 2 minutes

ఏప్రిల్, -జూన్ మధ్య రూ.18,900 కోట్ల అప్పు..ప్రతినెలా సగటున రూ.6,300 కోట్లు 

Caption of Image.

 

  • ఆర్బీఐ క్వార్టర్​ క్యాలెండర్‌‌‌‌‌‌‌‌లో వెల్లడి
  • కొత్త విధానం ‘బిస్’ కింద రుణాలు సేకరిస్తున్న  తెలంగాణ
  • రాష్ట్రానికి తగ్గనున్న వడ్డీ భారం.. భవిష్యత్​ అవసరాలపైనే దృష్టి

హైదరాబాద్​, వెలుగు : రాష్ట్ర ఆర్థిక అవసరాలు, రాబోయే మూడు నెలల్లో ప్రభుత్వం తీసుకోబోయే అప్పులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలను వెలువరించింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల నిర్వహణ కోసం మార్కెట్ రుణాలపై ఆధారపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఏప్రిల్ నుంచి జూన్ వరకు గల మొదటి త్రైమాసికంలో ఏకంగా రూ.18,900 కోట్ల అప్పు చేయాలని నిర్ణయించింది. అంటే సగటున ప్రతినెలా రూ.6,300 కోట్లు తీసుకుంటున్నది. గతంలో ఇది నెలకు రూ.4 వేల కోట్ల మేర ఉండగా, ఈసారి సుమారు రూ.2 వేల కోట్లకు పైగా పెరిగింది.

ఈ మేరకు ఆర్బీఐ విడుదల చేసిన రుణ క్యాలెండర్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ వివరాలను వెల్లడించింది. మునుపెన్నడూ లేని విధంగా అప్పుల సమీకరణలో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర బ్యాంక్ ప్రవేశపెట్టిన సరికొత్త ‘బెంచ్ మార్క్ ఇష్యూయెన్స్ స్ట్రాటజీ’ (బీఐఎస్​) పైలట్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లోకి కూడా తెలంగాణను చేర్చడం ప్రాధాన్యం సంతరించుకుంది.  ఆర్బీఐ షెడ్యూల్ ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ మొదటి వారం నుంచే రుణాలను తీసుకుంటున్నది. మొత్తం ఆరు విడతల్లో ఈ భారీ నిధులను సేకరించాలని ప్రణాళిక రూపొందించింది.

ఏప్రిల్ 7 న రూ.3,900 కోట్లతో మొదలై, జూన్ 16వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఇందులో దీర్ఘకాలిక అవసరాల కోసం 25 ఏళ్లకు పైబడిన బాండ్ల ద్వారా రూ.5,900 కోట్లు, అలాగే మధ్యస్థ కాల అవసరాల కోసం 16 నుంచి -20 ఏళ్ల బాండ్ల ద్వారా మరో రూ.6,000 కోట్లను సమీకరించనుంది. వీటితో పాటు 6 నుంచి 15 ఏళ్ల కాలపరిమితి గల బాండ్ల ద్వారా కూడా తగిన మొత్తంలో నిధులను కూడగట్టనుంది. రాష్ట్రంలో కొనసాగుతున్న గ్యారంటీల అమలు, మౌలిక సదుపాయాల కల్పన, ఉద్యోగుల జీతభత్యాల వంటి అత్యవసర వ్యయాలకు ఈ రుణాలు కీలకం కానున్నాయి. మేజర్​గా ఉద్యోగుల జీతాలు, పెన్షన్​లకే ఎక్కువ మొత్తం నిధులు వెళ్లనున్నాయి. మార్కెట్ ఒడిదుడుకులను దృష్టిలో ఉంచుకుని, వడ్డీ భారం పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ఆర్బీఐ పర్యవేక్షణలో ఈ నిధుల సేకరణ జరగనుంది.

లిక్విడిటీ పెంచడమే ప్రధాన లక్ష్యం.. 

ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాలు తమకు నిధులు అవసరమైనప్పుడు రకరకాల కాలపరిమితులతో (ఉదాహరణకు 7 ఏళ్లు, 12 ఏళ్లు, 19 ఏళ్లు ఇలా..) బాండ్లను విడుదల చేసేవి. దీనివల్ల మార్కెట్‌‌‌‌‌‌‌‌లో వేల సంఖ్యలో వేర్వేరు బాండ్లు ఉండిపోయేవి. ఫలితంగా పెట్టుబడిదారులు వీటిని తిరిగి అమ్ముకోవాలనుకున్నప్పుడు కొనేవారు తక్కువగా ఉండేవారు. దీన్నే ‘లిక్విడిటీ’ సమస్య అంటారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఆర్బీఐ ‘బెంచ్ మార్క్’ విధానాన్ని తెచ్చింది.

దీని ప్రకారం.. రాష్ట్రాలు ఇష్టమొచ్చిన కాలపరిమితితో కాకుండా, నిర్ణీత ‘బెంచ్ మార్క్’ గడువులతో (ఉదాహరణకు 5, 10, 15, 20, 25 ఏళ్లు) మాత్రమే బాండ్లను జారీ చేయాలి. దీనివల్ల ఒకే రకమైన బాండ్లు మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంటాయి, తద్వారా వాటిని ఎప్పుడైనా సులభంగా అమ్ముకునే వెసులుబాటు పెట్టుబడిదారులకు కలుగుతుంది. ఈ కొత్త విధానం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు వడ్డీ భారం తగ్గే అవకాశం ఉంది. పెట్టుబడిదారులకు (బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, విదేశీ సంస్థలు) తాము కొనే బాండ్లను సులభంగా అమ్ముకోవచ్చనే నమ్మకం కలిగితే, వారు తక్కువ వడ్డీ రేటుకే రాష్ట్రాలకు అప్పు ఇచ్చేందుకు ముందుకు వస్తారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ కోసం తెలంగాణను ఎంపిక చేయడం వెనుక  రాష్ట్ర ఆర్థిక లావాదేవీల వేగం కూడా ఒక కారణంగా పేర్కొన్నారు. 

బిస్ విధానంలో తెలంగాణ

పారదర్శకతను పెంపొందించడం లక్ష్యంగా ఆర్బీఐ మొదటిసారి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ‘బెంచ్ మార్క్ ఇష్యూయెన్స్ స్ట్రాటజీ’ (బిస్) విధానంలో ఎంపికైన 9 అగ్ర రాష్ట్రాల్లో తెలంగాణ నిలిచింది. ఈ విధానం వల్ల బాండ్ల వేలంలో పెట్టుబడిదారులకు స్పష్టత లభించడమే కాకుండా, రాష్ట్రానికి తక్కువ వడ్డీకే రుణాలు లభించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి సుమారు రూ.2.54 లక్షల కోట్లను అప్పుగా తీసుకోనుండగా, అందులో దక్షిణాది రాష్ట్రాల నుంచి తెలంగాణ వాటా గణనీయంగా ఉంది. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా ఈ విధానంలోనే అప్పులు సేకరిస్తోంది. ప్రభుత్వం సేకరించే ఈ భారీ రుణాలు కేవలం అప్పులుగానే మిగిలిపోకుండా, ఉత్పాదక రంగాల్లోకి మళ్లించి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడేలా చూడాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. 

ఏప్రిల్ 07    : రూ. 3,900 కోట్లు
ఏప్రిల్ 21    : రూ. 3,000 కోట్లు
మే 05            :  రూ.4,000 కోట్లు
మే 19            : రూ.2,000 కోట్లు
జూన్ 02    : రూ. 4,000 కోట్లు
జూన్ 16    : రూ. 2,000 కోట్లు

©️ VIL Media Pvt Ltd.