Reading Time: < 1 minute

ముత్తోజిపేటలో టెన్షన్: నర్సంపేట డిపోలో నివాళుల అంశంపై కొలిక్కిరాని చర్చలు

Caption of Image.

ముత్తోజిపేటలో హై టెన్షన్. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్‎కు నివాళులు అర్పించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ రాకతో ఉద్రిక్తంగా మారింది. ఎక్కడ అయితే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారో.. ఆ నర్సంపేట డిపోలో శంకర్ గౌడ్‎కు నివాళులు అర్పించాలంటూ పట్టుబట్టారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ క్రమంలోనే శంకర్ గౌడ్ డెడ్ బాడీని ఉంచిన ఫ్రీజర్‎తో ఆయన రోడ్డుపైకి వచ్చారు. 

ఊహించని ఈ ఘటనతో హడావిడి నెలకొంది. పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి నుంచి 200 మీటర్ల దూరం ఫ్రీజర్‎ను తీసుకొచ్చిన బీజేపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు.. శాంతియుతంగా అంత్యక్రియలు నిర్వహించాలంటూ కోరుతున్నారు. 

ఈ విషయంలో పోలీసుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. శాంతియుతంగానే తీసుకెళ్లి నివాళులు అర్పిస్తామని.. ఇందులో ఎందుకు రాద్దాంతం చేస్తున్నారంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. బండి సంజయ్ డిమాండ్లను ఒప్పుకోకపోవటంతో.. గంటకు పైగా.. నడి రోడ్డుపైనే డెడ్ బాడీతో నిరసన వ్యక్తం చేస్తున్నారాయన. 

ఇప్పటికే ముత్తోజిపేటకు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు, వివిధ ప్రజా సంఘాలు తరలివచ్చాయి. ఈ క్రమంలోనే ట్రాఫిక్ జాం అయ్యింది. సున్నితమైన అంశం కావటంతో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. శాంతియుతంగా అంత్యక్రియలు పూర్తి చేయించటానికి చర్చలు జరుపుతున్నారు పోలీసులు.

ఇంతకాలం పని చేసిన నర్సంపేట ఆర్టీసీ డిపోలో.. ఐదు నిమిషాలు నివాళులు అర్పించటానికి కుటుంబ సభ్యులు కోరుతున్నారని.. వాళ్ల మాట కూడా పట్టించుకోకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. శంకర్ గౌడ్ భార్య, కొడుకు పదేపదే కోరుతున్నా పట్టించుకోవటం లేదన్నారు. కుటుంబ సభ్యుల చివరి కోరిక తీర్చాలని.. దీన్ని ఎవరూ రాజకీయం చేయటం లేదన్నారాయన. నర్సంపేట డిపోకు ఎవరూ రాకుండా చూసుకుంటామని స్పష్టం చేశారాయన.

©️ VIL Media Pvt Ltd.