
అప్పు చేసి బిర్యానీ తింటున్న రోజులు.. అప్పు చేసి టూర్లకు వెళుతున్న సమాజం.. 10 వేల జీతానికి 20 వేలు అప్పు చేసి ఎంజాయ్ చేస్తున్న కాలం ఇది. అలాంటిది ఏడాదికి 50 లక్షల రూపాయల ప్యాకేజీ వస్తుంది.. ప్రతి నెలా అన్ని కటింగ్స్ పోను చేతికి 3 లక్షల రూపాయలు వస్తుంటే.. ఆ వ్యక్తి ఎలా ఉంటాడో ఊహించుకోండి.. లగ్జరీ కారు.. లగ్జరీ ఇల్లు.. లగ్జరీ వాచీలు.. లగ్జరీ ఐ ఫోన్.. సాయంత్రం అయితే పబ్స్.. వీకెండ్ పార్టీలతో ఎంజాయ్ చేస్తుంటారు కదా. అందరి విషయం ఏమో కానీ.. బెంగళూరులోని ఈ ఐటీ ఉద్యోగిని మాత్రం భిన్నం.. అందరి కంటే విభిన్నం. 50 లక్షల రూపాయల ప్యాకేజీ వస్తున్నా.. 10 వేల రూపాయల ఫోన్ వాడుతోంది. ఆటోలో ఆఫీసుకు వెళుతోంది.. ఒంటిపై బ్రాండెడ్ బట్టలు లేవు.. ఏదో 30, 40 వేల రూపాయల జీతగాడిలా బతుకుతోంది. ఇంతకీ నెలకు 3 లక్షల రూపాయల డబ్బును ఏం చేస్తున్నారు.. ఏ విధంగా ఖర్చు పెడుతున్నారనేది.. ఆ ఐటీ ఉద్యోగిని.. బెంగళూరు టెకీ మాటల్లోనే విందాం..
సాధారణంగా ఐటీ ఉద్యోగం చేసే వాళ్లు ఎలా ఉంటారు, ఏం కొంటారు, ఎలా లైఫ్ ఎంజాయ్ చేస్తారో మనందరికీ తెలిసిందే. కానీ ఈ 27 ఏళ్ల డేటా ఇంజినీర్ కథ వింటే లైఫ్ స్టైల్ అంటే ఆడంబరం కాదు.. ఆర్థిక భద్రత అని అర్థమవుతుంది. ఏటా రూ.50 లక్షల ప్యాకేజీ అందుకుంటున్నా, ఆమె ఎంచుకున్న సాదాసీదా లైఫ్ స్టైల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
వందల కోట్లు ఉన్నా అంబానీలు సింపుల్‌గా ఉంటారని వింటాం. కానీ నెలకు రూ. 3 లక్షల జీతం వచ్చే ఈ యువతి కూడా అదే బాటలో నడుస్తోంది. ఆమె వద్ద ఎటువంటి లగ్జరీ వస్తువులూ లేవు. తన దగ్గర డబ్బు ఉంది కదా అని ఇతరులను మెప్పించడానికి ఖర్చు చేయను ఉంటోంది సదరు టెక్కీ. తనకు అనుభవాలు ముఖ్యమని, అలంకారాలు కాదని ధీమాగా చెబుతోంది. చాలామంది జీతం పెరగగానే ఈఎంఐల మోత మోగిస్తుంటే.. ఈమె మాత్రం అనవసర ఖర్చులకు ఆమడ దూరంలో ఉంటూ మోడ్రన్ ఏజ్ లైఫ్ బిహేవియర్ రూల్స్ పక్కన పడేసి నేటి యువతను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కన్నవారికి ఇల్లు.. భవిష్యత్తుకు భరోసా
ఆమె సంపాదన వెనుక ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది. తనను చదివించి ప్రయోజకురాలిని చేసిన తల్లిదండ్రుల కోసం ఒక ఇల్లు కొనుగోలు చేసింది. దానికి ప్రతి నెలా రూ.30 వేల ఈఎంఐ చెల్లిస్తూ తన బాధ్యతను నెరవేరుస్తోంది. ఇది తన జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన నిర్ణయమని గర్వంగా చెబుతోంది. ఆడంబరాలకు పెట్టే ఖర్చును తగ్గించి.. కన్నవారి కళ్లలో ఆనందాన్ని వెతుక్కుంది.
ఆర్థిక క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్
ఆమె కేవలం సంపాదించడమే కాదండి బాబు.. ఆ డబ్బును ఎలా పెట్టుబడి పెట్టి గ్రో చేసుకోవాలో కూడా నేర్పిస్తోంది. ప్రతి నెలా ఏకంగా రూ. లక్షను ఎస్‌ఐపీ రూపంలో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతోంది. అకస్మాత్తుగా ఉద్యోగం పోయినా లేదా ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనా.. కనీసం 6 నెలల పాటు ఇబ్బంది పడకుండా ఉండేలా ఎమర్జెన్సీ ఫండ్ కూడా సిద్ధం చేసుకుంది.
షో-ఆఫ్ కోసం అప్పులు చేసే నేటి కాలం యువతకు ఈ లేడీ టెక్కీ ఒక రోల్ మోడల్ అని చెప్పొచ్చు. మన సంపాదన మనకు స్వేచ్ఛను ఇవ్వాలి తప్ప, సమాజం కోసం బానిసలను చేయకూడదనేది ఆమె ఫిలాసఫీ. నిజమైన సంపద అంటే చేతిలో ఉన్న ఐఫోన్ కాదు.. బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్, మనశ్శాంతి అని ఆమె నిరూపిస్తోంది.