
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతం భారీగా పెరగడంపై సుప్రీం కోర్టు హర్షం వ్యక్తం చేసింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో 92.7 శాతం ఓటింగ్ నమోదు కావడం గర్వంగా ఉందని సీజేఐ సూర్యకాంత్ అన్నారు. భారత పౌరుడిగా ఓటింగ్ శాతం పెరగడం చూసి సంతోషంగా ఉందన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడుతుందని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న వలస కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పశ్చిమ బెంగాల్‌కు వచ్చారని సీనియర్ న్యాయవాది కళ్యాణ్ బెనర్జీ కోర్టుకు తెలిపారు. కొన్ని సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి దశ ఎన్నికలు ఏప్రిల్ 23న జరిగాయి. మొదటి దశలో (92.7 శాతం) రికార్డ్ స్థాయి ఓటింగ్ నమోదైంది. ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగగా.. సుమారు 3.6 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
►ALSO READ | సీఎం భార్యపై ఆరోపణల కేసులో పవన్ ఖేరాకు హైకోర్టులో ఎదురు దెబ్బ
2021 అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో నమోదైన 84 శాతం పోలింగ్ కంటే ఈసారి (92.7 శాతం) రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం గమనార్హం. పశ్చిమ బెంగాల్‌లోని మిగిలిన 142 స్థానాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.
అధికార టీఎంసీ, ప్రతిపక్ష టీఎంసీ హోరాహోరీగా తలపడుతున్నాయి. గెలుపుపై ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పెరిగిన ఓటింగ్ శాతం తమకు కలిసి వస్తుందని ఇరు పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి. మరీ బెంగాల్ గడ్డపై ఏ జెండా ఎగురుతుందో తెలియాలంటే మే 4వ తేదీ వరకు ఆగాల్సిందే.