Reading Time: 2 minutes
Telangana: ఆ ప్రచారం అవాస్తవం.. నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం ప్రభాకర్

రెండ్రోజులకే ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. డిమాండ్ల సాధన కోసం పోరుబాట పట్టిన కార్మికులు… ప్రాణాలు తీసుకొనేందుకూ వెనుకాడట్లేదు. నర్సంపేట బస్‌ డిపోలో డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకోవడం కలకలం రేపింది. ఎంజీఎంలో చికిత్స అనంతరం.. మెరుగైన చికిత్స కోసం శంకర్‌గౌడ్‌ను హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కంచన్‌బాగ్ డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. అయితే.. అంతకుముందు శంకర్ గౌడ్ చనిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.. అది అవాస్తవమని.. దానిని నమ్మొద్దంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన విడుదల చేశారు. స్వయంగా ఆసుపత్రికి చేరుకుని.. శంకర్ కుటుంబసభ్యులను పరామర్శించారు.

ప్రచారం.. అవాస్తవం..

నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ చనిపోయారని సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని.. మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శంకర్ గౌడ్ కి కంచన్ బాగ్ డిఆర్డీవో అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుందన్నారు. ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందేలా అవాస్తవాలు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

శంకర్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి పై అపోలో ఆసుపత్రి వైద్యులతో మాట్లాడానని.. వారికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం అండగా ఉంటుందని వారితో మాట్లాడి.. హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు.

మరో ఇద్దరు

అటు మిర్యాలగూడలో వెంకన్న అనే డ్రైవర్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్నారు. భద్రాచలంలో డ్రైవర్‌ లింగారెడ్డి.. గడ్డిమందు తాగడం మరింత కలకలం రేపింది. అబద్ధపు ప్రకటనల వల్లే కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆర్టీసీ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వరుసగా ఈనెల 29వరకు మౌన ప్రదర్శన, వంటా వార్పు, అర్ధ నగ్న ప్రదర్శనల వంటి నిరసనలకు పిలుపునిచ్చింది.

సమ్మెపై స్పందించిన రేవంత్

మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కార్మికులు ప్రాణాలు తీసుకోవడం సమస్యలకు పరిష్కారం.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని రిక్వెస్ట్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు సంయమనం పాటించి సమ్మె విరమించాలని మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. చర్చలకు సిద్ధంగా ఉన్నామన్న మంత్రి.. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. కాగా డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో మంత్రులు శుక్రవారం కార్మిక సంఘాలతో చర్చలు జరపనున్నారు.