
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మహిళల పునరుత్పత్తి హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛపై మానవీయ కోణంలో చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 7 నెలల గర్భాన్ని తొలగించుకునేందుకు ఒక 15 ఏళ్ల బాలికకు అనుమతినిస్తూ.. మహిళ ఇష్టానికి వ్యతిరేకంగా గర్భాన్ని కొనసాగించాలని ఏ కోర్టు కూడా ఒత్తిడి చేయటం సరైనది కాదంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది.
కడుపులో పెరుగుతున్న పిండం కంటే గర్భిణిగా ఉన్న మహిళ నిర్ణయానికే ప్రాధాన్యత ఉంటుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ముఖ్యంగా మైనర్ బాలికల విషయంలో ఇష్టం లేని గర్భాన్ని కొనసాగించడం వల్ల వారి మెంటల్ హెల్త్, ఎడ్యుకేషన్, సామాజిక హోదా, భవిష్యత్తు ఎదుగుదలపై తీవ్రమైన దుష్ప్రభావాలు ఉంటాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మహిళ తన శరీరంపై.. ముఖ్యంగా పునరుత్పత్తి విషయాల్లో నిర్ణయం తీసుకునే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యతలో అంతర్భాగమని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది.
ఈ కేసులో బాలిక కేవలం 15 ఏళ్ల వయస్సు గల మైనర్ అని, ఆమెకు ఆ గర్భం ఏమాత్రం ఇష్టం లేదని కోర్టు గుర్తించింది. గర్భాన్ని కొనసాగించమని బలవంతం చేయడం వల్ల ఆమె తీవ్రమైన మానసిక.. శారీరక వేదనకు గురయ్యే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఇది రాజ్యాంగ విలువలకే విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. ఒకవేళ కోర్టులు ఇలాంటి అనుమతులు నిరాకరిస్తే.. బాధితులు సురక్షితం కాని చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా గర్భస్రావం చేసుకునే ప్రమాదం ఉందని, అది వారి ప్రాణాలకే ముప్పు తెస్తుందని న్యాయమూర్తులు హెచ్చరించారు.
ALSO READ : ఫేస్ బుక్ ఉద్యోగులపై AI నిఘా
దత్తత అనేది పరిష్కారం కాదని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. పిల్లలను పెంచడం ఇష్టం లేకపోతే జన్మనిచ్చిన తర్వాత దత్తత ఇవ్వవచ్చు కదా అని చెప్పడం చాలా ఈజీ అని.. కానీ గర్భం దాల్చడమే ఇష్టం లేనప్పుడు, ఆ గర్భాన్ని బలవంతంగా మోయాలని చెప్పడం ఏమాత్రం సమర్థనీయం కాదని కోర్టు అభిప్రాయపడింది. ప్రతి కేసును పుట్టబోయే బిడ్డ కోణంలో కాకుండా.. గర్భంతో బాలిక పడుతున్న వేదన కోణంలో చూడాలని రాజ్యాంగ ధర్మాసనం సూచించింది. ఆ బాలిక ఇప్పటికే 2 సార్లు ఆత్మహత్యాయత్నం చేసిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఆమె శ్రేయస్సు దృష్ట్యా గర్భాన్ని తొలగించుకునేందుకు పచ్చజెండా ఊపింది. దీంతో ప్రస్తుతం ఈ తీర్పు సమాజంలో మహిళలందరినీ ఆలోచింపజేస్తోంది.