
- తెల్లవారుజామున హోటల్ తెరిచాడన్న కారణంతో చర్య
- సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్
మెహిదీపట్నం, వెలుగు: టోలిచౌకి పరిధిలో ఓ వ్యక్తిని ఏఆర్ కానిస్టేబుల్ విచక్షణారహితంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ రమేశ్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. టోలిచౌకి పోలీస్ స్టేషన్లో రామేశ్వర్ ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో టోలిచౌకి లీమ్రా ఎక్స్ రోడ్ వద్ద ఉన్న ‘ఆల్ రికాబ్’ హోటల్ తెరిచి ఉండటాన్ని కానిస్టేబుల్ గమనించాడు. అంత పొద్దున్నే షాపు ఎందుకు తెరిచావంటూ కౌంటర్ వద్ద ఉన్న గుల్బర్గాకు చెందిన చందు అనే వ్యక్తిని ప్రశ్నించాడు.
ఈ క్రమంలో జరిగిన వాగ్వాదంలో కానిస్టేబుల్‌ను చందు తిట్టి పారిపోవడానికి ప్రయత్నించగా, ఆగ్రహానికి గురైన రామేశ్వర్ అతడిని పట్టుకుని తీవ్రంగా కొట్టాడు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు హోటల్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. రక్షించాల్సిన పోలీసులే సామాన్యులపై ఇలా విచక్షణ రహితంగా దాడి చేయడంపై పలువురు మండిపడుతుండగా, ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు.