Reading Time: 2 minutes
Supreme Court Hearing On Women Entry And Prayer Rights In Mosques

Supreme Court: సాధారణంగా మజీదుల్లోకి మహిళలు వెళ్లరు. ఇంట్లోనే ఉండి వారి దైవాన్ని ప్రార్థిస్తారు. తాజాగా ఈ అంశంపై సుప్రీంకోర్టులో ఆసక్తికర చర్చ జరిగింది. మసీదుల్లో మహిళల ప్రవేశం, ప్రార్థనలు చేసే విధానంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న చర్చ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మసీదుల్లో మహిళలకు సమాన హోదా కల్పించాలని లేదా ముందు వరుసలో చోటు ఇవ్వాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు ఈ అంశంపై ఆసక్తికరమైన వాదనలు సాగాయి. ఈ వాదనలు జరిగే క్రమంలో ధర్మాసనంలోని ఓ సభ్యుడైన జస్టిస్ ఎహసానుద్దీన్ అమానుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రవక్త కాలం నుంచే మసీదుల్లోకి మహిళల ప్రవేశంపై ఎలాంటి నిషేధం లేద స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. అయితే, ఇస్లాం ధర్మంలో మహిళలు ప్రార్థనలు చేసే విధానానికి సంబంధించి కొన్ని ప్రత్యేక ఆచారాలు, ప్రక్రియలు ఉన్నాయని వివరించారు. ముఖ్యంగా, పురుషుల మాదిరిగా మసీదుకు వెళ్లి ప్రార్థనలు చేయడం కంటే మహిళలు ఇంట్లోనే నమాజ్ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఓ సామాజిక కోణం ఉందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఇంట్లోని పెద్దలందరూ మసీదుకు వెళ్తే, పిల్లల సంరక్షణ బాధ్యత ఎవరు చూస్తారనే ఉద్దేశంతోనే ఈ పద్ధతి అమలులోకి వచ్చి ఉండవచ్చని పేర్కొన్నారు. మహిళలు మసీదులో ముందు వరుసలో నిలబడాలా లేక విడిగా ప్రార్థన చేయాలా అనేది గత 1200 ఏళ్లుగా వస్తున్న ఆచారాల ప్రకారమే జరుగుతోందని గుర్తుచేశారు.

మరోవైపు, ఈ అంశంపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ తరపున సీనియర్ అడ్వకేట్ ఎం.ఆర్. షంషాద్ వాదనలు వినిపించారు. మహిళలు ప్రార్థనలు చేసుకోవడానికి మసీదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసే సంప్రదాయాన్ని కోర్టు ప్రశ్నించలేదని వాదించారు. మసీదుల్లో మహిళలకు ప్రవేశం ఉన్నప్పటికీ, వారు తమ ఇళ్లలోనే నమాజ్ చేసుకోవడం ఉత్తమమని తెలిపారు. ఇదే సమయంలో 1994లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ పాత తీర్పును తీవ్రంగా వ్యతిరేకించారు. నమాజ్ చేసుకోవడానికి మసీదు అనేది తప్పనిసరి కాదని, బహిరంగ ప్రదేశాల్లోనూ ప్రార్థనలు చేసుకోవచ్చని గతంలో కోర్టు పేర్కొంది. అయితే, ఈ ప్రాతిపదిక పూర్తిగా తప్పని, మసీదు అనేది ఇస్లాంలో విడదీయలేని భాగమని షంషాద్ వాదించారు. ముస్లింల విశ్వాసాలకు మసీదు కేంద్రబిందువు అని, అన్ని ఆచారాలు మసీదుతోనే ముడిపడి ఉంటాయని స్పష్టం చేశారు. మసీదుల్లో మహిళలకు సమాన హోదా కల్పించాలని లేదా ముందు వరుసలో చోటు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లలో పేర్కొన్న అంశాలు ఖురాన్‌లో ఎక్కడా లేవని కోర్టుకు వివరించారు. మసీదులో ప్రత్యేకంగా ‘పవిత్ర స్థలం’ అనే భావన ఏమీ ఉండదని, కేవలం శతాబ్దాలుగా వస్తున్న ఆచారాలే అక్కడ అమలవుతున్నాయని వాదించారు. ఈ వాదనలు ఆసక్తికరంగా మారాయి.