Reading Time: 2 minutes
ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ. కోటిన్నర బీమా

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కాంపోజిట్ శాలరీ అకౌంట్ ప్యాకేజ్ సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఏడాది జనవరి 14న ఈ పథకాన్ని ప్రభుత్వం అధికారికంగా లాంచ్ చేసింది. ఇది సాధారణ బ్యాంకింగ్ సేవలతో పాటు బీమా, రుణాలు, కార్డు సౌకర్యాలను ఒకే శాలరీ అకౌంట్‌లో ఏకీకృతం చేసిన వన్ స్టాప్ ఫైనాన్షియల్ సొల్యూషన్‌గా రూపొందించారు. ఈ పథకం కేంద్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాల ఉద్యోగులకు (A, B, C, D), మిలటరీ, పారామిలటరీ, ఇతర భద్రతా దళాల సిబ్బందికి వర్తిస్తుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.

ఈ కొత్త పథకంలో ఉన్న ప్రయోజనాలు

బ్యాంకింగ్ సౌకర్యాలలో జీరో బ్యాలెన్స్ శాలరీ అకౌంట్ ఉంటుంది. RTGS, NEFT, IMPS, UPI లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు ఉండవు. అలాగే ఉచిత మల్టీ-సిటీ చెక్ బుక్‌లు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు, లాకర్ అద్దెపై ప్రత్యేక తగ్గింపులు ఉంటాయి. అలాగే మీరు ఇంటి, ఎడ్యుకేషన్, వాహన, వ్యక్తిగత లోన్‌లు ఏవి తీసుకున్నా.. వాటి పై తక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి. అంతేకాదు లోన్ ప్రాసెసింగ్ ఛార్జీల నుండి పూర్తి మినహాయింపు లేదా భారీ తగ్గింపు లభిస్తుంది.

ఈ పథకం కింద రూ. 1.5 కోట్ల వరకు ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే వ్యక్తిగత ప్రమాద బీమా లభిస్తోంది. అలాగే రూ. 2 కోట్ల వరకు విమాన ప్రమాద బీమా కూడా ఉంటుంది. శాశ్వత పాక్షిక వైకల్యంపై రూ. 1.5 కోట్ల, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద రూ. 20 లక్షల వరకు పొందవచ్చు. అదనపు టాప్-అప్ సదుపాయంతో కుటుంబం మొత్తానికి సమగ్ర ఆరోగ్య బీమా సౌకర్యం పొందవచ్చు. వీటితోపాటు డెబిట్ , క్రెడిట్ కార్డులపై మెరుగైన రివార్డ్స్, క్యాష్‌బ్యాక్, ఎయిర్‌పోర్ట్ లౌంజ్ సౌకర్యాలు పొందవచ్చు.

అయితే ఈ బ్యాంక్-లింక్డ్ ప్యాకేజీ ప్రస్తుతం అమలులో ఉన్న CGEGIS ను భర్తీ చేయదు. దానికి ఇది అదనపు ప్రయోజనంగా మాత్రమే ఉంటుంది. అంటే ఉద్యోగులు అటు ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలను, ఇటు బ్యాంక్ ద్వారా లభించే ఈ భారీ బీమా కవరేజీని రెండింటినీ పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భద్రత, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందనడానికి ఈ కొత్త పథకం మరో ఉదాహరణగా నిలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.