
దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల ఎంపిక, అధిక ధరలకు ప్రైవేట్ పబ్లిషర్ల పుస్తకాలను విక్రయించడంపై వస్తున్న ఫిర్యాదులను జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా పరిగణించింది. ఈ విషయంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అనుసరిస్తున్న తీరును ‘విద్యా వివక్ష’గా అభివర్ణిస్తూ, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది.
ప్రైవేట్ పాఠశాలలు తమపై ఒత్తిడి తెచ్చి, అధిక ధరలు కలిగిన ప్రైవేట్ ప్రచురణకర్తల పుస్తకాలను కొనుగోలు చేయిస్తున్నాయని వివిధ ప్రాంతాల తల్లిదండ్రులు ఫిర్యాదులు చేశారు. ఈ అంశంపై నమో ఫౌండేషన్ దాఖలు చేసిన ఫిర్యాదును పురస్కరించి, ప్రియాంక్ కనూంగో నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కమిషన్ తన నోటీసుల్లో రాష్ట్ర ప్రభుత్వాల నుండి పలు అంశాలపై సవివరమైన నివేదికలను కోరింది. విద్యార్థులపై పుస్తకాల భారం తగ్గించే దిశగా అమలు చేస్తున్న జాతీయ పాఠశాల బ్యాగుల విధానం గురించి ఆరా తీసింది. విద్యా హక్కు చట్టం (RTE) సెక్షన్ 29లో నిర్దేశించిన నిబంధనల ప్రకారం పాఠ్యాంశాల అమలు తీరుపై వివరణ కోరింది. SCERT ప్రచురిస్తున్న పుస్తకాల సంఖ్య ఎంత? ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఇవి అందుబాటులో ఉన్నాయా? అనే సమాచారం ఇవ్వాల్సిందిగా విద్యాశాఖను ఆదేశించింది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు SCERT/NCERT పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందిస్తున్నప్పుడు, ప్రైవేట్ పాఠశాలలు కూడా అదే నాణ్యమైన పుస్తకాలను నిర్ణీత రుసుము ప్రాతిపదికన ఎందుకు అమలు చేయడం లేదని కమిషన్ ప్రశ్నించింది. “పాఠశాల ప్రభుత్వానిదా లేక ప్రైవేట్ యాజమాన్యానిదా అనే దానిని బట్టి పాఠ్యపుస్తకాలు, పాఠ్యాంశాల్లో తేడాలు చూపడం స్పష్టంగా విద్యాపరమైన వివక్ష కిందకే వస్తుంది.” అని కమిషన్ స్పష్టం చేసింది. ముఖ్యంగా 8వ తరగతి వరకు వివిధ పరీక్షా బోర్డులు (CBSE, ICSE వంటివి) నిర్దేశించిన సిలబస్, విద్యా అధికార సంస్థ నిర్దేశించిన సిలబస్ కంటే ఎందుకు భిన్నంగా ఉందో వివరణ ఇవ్వాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖను NHRC కోరింది.ఈ చర్యల ద్వారా ప్రైవేట్ పాఠశాలల ఏకపక్ష ధోరణికి అడ్డుకట్ట పడటమే కాకుండా, దేశవ్యాప్తంగా ఒకే విధమైన ప్రామాణిక విద్యా విధానం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..