Reading Time: < 1 minute
Harshavardhan Rameshwar Clarifies Rumors On Trivikram Venkatesh Aadarsha Kutumbam

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న ఆదర్శ కుటుంబం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా సంగీత దర్శకుడిగా మొదట ఎంపికైన హర్షవర్ధన్ రామేశ్వర్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని, ఆయన స్థానంలో త్రివిక్రమ్ ఆస్థాన సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ బాధ్యతలు చేపట్టారని ప్రచారం సాగింది. ఈ ప్రచారంపై ఇటు వెంకీ అభిమానుల్లోనూ, అటు సినీ వర్గాల్లోనూ రకరకాల చర్చలు మొదలయ్యాయి. తమన్ – త్రివిక్రమ్ కాంబినేషన్ హిట్ కాబట్టి ఇది నిజమే కావొచ్చని కొందరు భావిస్తే, ‘యానిమల్’ సినిమాతో సంచలనం సృష్టించిన హర్షవర్ధన్ ఉండటమే కరెక్ట్ అని మరికొందరు అభిప్రాయపడ్డారు.

ఈ రూమర్లకు తాజాగా ఫుల్ స్టాప్ పడింది. స్వయంగా హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఒక టాలీవుడ్ జర్నలిస్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ నుండి తను తప్పుకున్నాననే వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని హర్షవర్ధన్ స్పష్టం చేశారు. “నేను ‘ఆదర్శ కుటుంబం’ నుండి తప్పుకున్నట్లు వస్తున్న వార్తలన్నీ పచ్చి అబద్ధం. ప్రస్తుతం నేను చెన్నైలో ఉన్నాను. మే 1వ తేదీన మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం హైదరాబాద్ వస్తున్నాను” అని ఆయన వివరించారు. వెంకటేష్ కెరీర్‌లో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి క్లాసిక్ సినిమాలకు డైలాగులు అందించిన త్రివిక్రమ్, ఇప్పుడు చాలా కాలం తర్వాత పూర్తిస్థాయి దర్శకుడిగా ఆయనను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై హైప్ ఓ రేంజ్‌లో ఉంది. దానికి తోడు హర్షవర్ధన్ రామేశ్వర్ తన యూనిక్ మ్యూజిక్‌తో ఈ సినిమాకు ఎలాంటి ట్యూన్స్ ఇస్తారోనని అందరూ ఎదురుచూస్తున్నారు. తాజా క్లారిటీతో ఈ సినిమా సంగీతం విషయంలో ఉన్న సందిగ్ధత తొలగిపోయింది. వచ్చే నెల నుంచి మ్యూజిక్ వర్క్ శరవేగంగా జరగనుందని తెలుస్తోంది.