Reading Time: 2 minutes
Shivam Dube World Cup Hero Secret Train Journey 3rd Ac Mumbai

Shivam Dube: భారత క్రికెట్ జట్టు T20 ప్రపంచకప్‌ను ముచ్చటగా మూడోసారి ముద్దాడి చరిత్ర సృష్టించిన వేళ, టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ శివమ్ దూబేకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో 24 పరుగులు పిండుకుని, భారత్‌ను విజేతగా నిలిపిన శివమ్ దూబే.. అహ్మదాబాద్ నుంచి ముంబైకి రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రపంచకప్ గెలిచిన ఉత్సాహంలో దేశమంతా సంబరాలు చేసుకుంటుండగా, ఈ ‘వరల్డ్ కప్ హీరో’ మాత్రం తన కుటుంబాన్ని చేరుకోవడానికి పడ్డ తపన ఇప్పుడు చర్చనీయాంశమైంది.

READ ALSO: Nara Lokesh: ఢిల్లీలో కూటమి ఎంపీల ఆత్మీయ కలయిక.. రామ్మోహన్‌ నాయుడు ఇంట్లో లోకేష్‌ సందడి..

విమానంలో టిక్కెట్లు లేక.. రైలు ప్రయాణం
మ్యాచ్ ముగిసిన తర్వాత తన నాలుగేళ్ల కుమారుడు అయాన్, రెండేళ్ల కుమార్తె మహవిష్‌లను చూడటానికి దూబే ముంబై వెళ్లేందుకు విమాన టిక్కెట్లు ప్రయత్నించగా సీట్లు దొరకలేదు. రోడ్డు మార్గంలో వెళ్లడం కంటే రైలు ప్రయాణం వేగంగా ఉంటుందని భావించి, తన భార్య అంజుమ్‌తో కలిసి సయాజీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు.

గుర్తుపట్టకుండా జాగ్రత్తలు:
ప్రపంచకప్ గెలిచిన స్టార్‌ను రైలులో చూస్తే జనం ఎగబడతారని తెలుసు. అందుకే దూబే ఒక పక్కా ప్లాన్ వేశారు. ముఖానికి మాస్క్, తలపై టోపీ, ఫుల్ హ్యాండ్స్ టీ-షర్ట్ ధరించి గుర్తుపట్టకుండా జాగ్రత్త పడ్డారు. స్టేషన్‌లో రద్దీని తట్టుకోవడానికి, రైలు బయలుదేరడానికి సరిగ్గా ఐదు నిమిషాల ముందు కారు దిగి వేగంగా లోపలికి వెళ్లారు. ఆయనకు థర్డ్ ఏసీలో అప్పర్ బెర్త్ దొరికింది. ప్రయాణమంతా ఎవరికీ కనిపించకుండా అక్కడే ఉండిపోయారు. ప్రయాణంలో టికెట్ చెకర్ (TTE) వచ్చినప్పుడు ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. టికెట్‌పై పేరు చూసి.. “శివమ్ దూబేనా? అంటే ఆ క్రికెటరా?” అని టిటిఈ ఆశ్చర్యంగా అడిగారు. వెంటనే దూబే భార్య అంజుమ్ సమయస్ఫూర్తితో స్పందిస్తూ.. “కాదు కాదు.. ఆయన ఇక్కడికి ఎందుకు వస్తారు?” అని బదులిచ్చి విషయాన్ని దాటవేశారు. అలా ఆ స్టార్ క్రికెటర్ తన గుర్తింపు బయటపడకుండా సురక్షితంగా ముంబై చేరుకున్నారు. “నా స్నేహితులు, కుటుంబ సభ్యులు అంతా ఆందోళన చెందారు. కానీ నా పిల్లలను చూడాలనే ఆత్రుతతో ఈ రిస్క్ తీసుకున్నాను. థర్డ్ ఏసీలో ప్రయాణం ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది” అని శివమ్ దూబే తన ప్రయాణం గురించి పంచుకున్నారు.

READ ALSO: Turkey Supports Iran: ఇరాన్‌కు బహిరంగ మద్దతు ప్రకటించిన ముస్లిం దేశం.. ఇప్పుడు అమెరికాతో యుద్ధం చేస్తుందా?