Reading Time: < 1 minute
Doctors Team Performs Marriage For Girl Met On Social Media Inspiring Story

నేటి డిజిటల్ యుగంలో మనుషుల మధ్య సంబంధాలు కేవలం అవసరాలకే పరిమితమవుతున్నాయి. ఒకరికి ఒకరు సాయం చేసుకోవడమే అరుదైన ఈ రోజుల్లో.. ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న అపరిచితుల కోసం తామే పెళ్లి పెద్దలుగా నిలబడటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ప్రాంతాలు వేరైనా, రక్తసంబంధం లేకపోయినా.. ఆపదలో ఉన్న వారిని తమ సొంత మనుషులుగా భావించి అండగా నిలిచే గొప్ప మనసున్న వారు ఇంకా ఈ సమాజంలో ఉన్నారని నిరూపించారు కొందరు మహిళా వైద్యులు. ఆధునిక కాలంలో సోషల్ మీడియా అంటే కేవలం కాలక్షేపానికే అనుకునే వారికి.. అదే వేదికను ఒక ఆడబిడ్డ జీవితాన్ని నిలబెట్టే పునాదిగా మార్చి, వీరు ఎంతో మందికి ఆదర్శంగా.. స్ఫూర్తిప్రదాతలుగా నిలిచారు.

Also Read:Marriage Vs Love: పెళ్లి పీటల మీద నుంచి లేచి.. ప్రియుడి పక్కన నిల్చున్న పెళ్లి కూతురు.. షాకైన పెళ్లికొడుకు..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంతో మంది ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కదిరికి చెందిన డాక్టర్ శ్రీదేవి బృందం మాత్రం ఒక గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన గీతాంజలి అనే యువతికి, డాక్టర్ శ్రీదేవికి సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. కొద్ది కాలం క్రితం గీతాంజలి తండ్రి మరణించడంతో ఆ కుటుంబం ఆర్థికంగా, మానసికంగా ఎంతో కుంగిపోయింది. ఆ అమ్మాయి దీనస్థితిని చూసి చలించిన డాక్టర్ శ్రీదేవి బృందం, గీతాంజలిని తమ సొంత ఇంటి ఆడబిడ్డగా భావించింది.

Also Read:IND vs NZ: T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో టాస్ మినీ-ఫైనల్ అవుతుందా?.. IND vs NZ ఫైనల్‌లో టాస్ ఎందుకు కీలకం

తామే పెళ్లి పెద్దలై, పెళ్లికి కావాల్సిన అన్ని లాంచనాలను దగ్గరుండి చూసుకుని, గీతాంజలి వివాహాన్ని ఘనంగా జరిపించారు. మహిళా దినోత్సవం రోజునే ఈ పెళ్లి జరగడం.. తామంతా ఒక ఆడబిడ్డ జీవితంలో వెలుగులు నింపడం ఎంతో తృప్తినిచ్చిందని డాక్టర్ శ్రీదేవి ఈ సందర్భంగా పేర్కొన్నారు. పరిచయం లేని వ్యక్తి కోసం, ప్రాంతీయ భేదాలు లేకుండా వారు చేసిన ఈ సాయం చూసి స్థానికులు, బంధువులు ఆ వైద్యుల బృందాన్ని అభినందనలతో ముంచెత్తారు.