Reading Time: 2 minutes

T20 World Cup Final: టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్‌లో టీమిండియా రికార్డులు.. 

Caption of Image.

T20 World Cup Final: టీ20 ప్రపంచకప్ 2026లో ఇంగ్లాండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన భారత జట్టు మరోసారి చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచింది. న్యూజిలాండ్‌తో జరగనున్న ఈ ఫైనల్ పోరుతో టీమిండియా టీ20 ప్రపంచకప్ చరిత్రలో నాలుగోసారి ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇప్పటి వరకు ఇండియన్ టీమ్ మూడు సార్లు ఫైనల్ ఆడగా, అందులో రెండు సార్లు టైటిల్‌ను దక్కించుకుంది. ఈసారి కూడా ట్రోఫీని గెలిచి ప్రపంచ క్రికెట్ లో అధిపత్యం ప్రదర్శించాలని చూస్తుంది. 

2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్: 
టీ20 ప్రపంచకప్ ప్రారంభమైన మొదటి టోర్నమెంట్ 2007లోనే భారత్ ఫైనల్‌కు చేరుకుంది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని యువ భారత జట్టు అద్భుత ప్రదర్శనతో పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఐదు పరుగుల తేడాతో విజయం సాధించి మొదటిసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆ ఫైనల్‌ మ్యాచ్ లో గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు. జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అతడు 54 బంతుల్లో 75 పరుగులు చేసి భారత జట్టు విజయంలో కీ రోల్ పోషించాడు.

2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్: 
టీమిండియా రెండోసారి 2014లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరింది. బంగ్లాదేశ్‌లోని ఢాకాలోని షేర్–-ఎ–-బంగ్లా నేషనల్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ విజయంతో శ్రీలంక తన తొలి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకుంది.

2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్: 
2024లో భారత్ మూడోసారి ఫైనల్‌కు చేరి దక్షిణాఫ్రికాపై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో టీమిండియా రెండోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆ ఫైనల్‌ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతమై ఇన్నింగ్స్ ఆడాడు. 76 పరుగులు చేసి టీమిండియా జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ ప్రదర్శనకు గాను అతనికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది.  

2026లో చరిత్ర సృష్టించే ఛాన్స్: 
2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్ మరోసారి ఫైనల్‌కు చేరుకుంది. న్యూజిలాండ్‌తో జరిగే ఈ తుది పోరులో విజయం సాధిస్తే టీమిండియా మరో చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా టైటిల్‌ను కాపాడుకున్న తొలి జట్టుగా నిలవనుంది.  
 

©️ VIL Media Pvt Ltd.