Reading Time: 2 minutes

 T20 World Cup Final: భారత్–న్యూజిలాండ్ మధ్య వరల్డ్ కప్ ఫైనల్.. వర్షం లేదా టై అయితే ఏంటి పరిస్థితి?

Caption of Image.

T20 World Cup Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడేందుకు భారత్ సిద్ధమైంది. రేపు (మార్చి 8న) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఈ తుది పోరులో చరిత్ర సృష్టించేందుకు టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించిన సూర్యకుమార్ సేన వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరిన మూడో జట్టుగా నిలిచింది. వరుసగా రెండోసారి టైటిల్‌ను కాపాడుకునేందుకు గట్టి సంకల్పంతో ఇండియన్ టీమ్ ముందుకు సాగుతుంది. అయితే న్యూజిలాండ్‌ జట్టును కూడా తక్కువ అంచనా వేయొద్దు.. అనేక సందర్భాల్లో అండర్‌డాగ్‌గా కనిపించినా ప్రపంచకప్‌లో భారత్‌పై ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ కివీస్ విజయం సాధించింది. అందువల్ల ఫైనల్ పోరు మరింత ఆసక్తికరంగా మారే ఛాన్స్ ఉంది.  

రేపు (మార్చి 8న) వాన కారణంగా మ్యాచ్ జరగకపోయినా లేదా అసంపూర్తిగా ఆగిపోయినా, మరుసటి రోజు అంటే మార్చి 9వ తేదీని ‘రిజర్వ్ డే’గా ఐసీసీ ఫిక్స్ చేసింది. ఒకవేళ మార్చి 8న టాస్ పడి, కొంత ఆట జరిగిన తర్వాత వర్షం కురిస్తే, రిజర్వ్ డే నాడు మ్యాచ్ మళ్లీ మొదటి నుంచి కాకుండా ఆగిపోయిన దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. అలాగే మ్యాచ్ పూర్తి చేయడానికి వీలుగా రెండు రోజులూ 120 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయించింది. ఓవర్ల తగ్గింపు ద్వారా అయినా పూర్తి ఫలితం రాబట్టేందుకు అంపైర్లు ప్రయత్నిస్తారు.

►ALSO READ | T20 World Cup Final: భారత్–న్యూజిలాండ్ ఫైనల్‌కు స్పెషల్ పిచ్.. 200+ పరుగులు స్కోర్ పక్కా?

అయితేఫైనల్ ఫలితం తేలాలంటే రెండు జట్లు కనీసం 10 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ దురదృష్టవశాత్తూ మార్చి 8, 9 తేదీల్లో కూడా వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే, ఐసీసీ నిబంధనల ప్రకారం భారత్ వర్సెస్ -న్యూజిలాండ్ జట్లను ‘సంయుక్త విజేతలు’గా ప్రకటిస్తారు. 2002 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్–-శ్రీలంక జట్లు ఇలాగే టైటిల్ ని పంచుకున్నాయి. కానీ టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించాలనే పట్టుదలతో ముందుకు సాగుతుంది. ఇప్పటివరకు ఏ జట్టు కూడా వరుసగా రెండు టైటిళ్లు గెలవలేదు. ఐసీసీ టోర్నీల్లో భారత్ పై కివీస్ కి అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు న్యూజిలాండ్ ని టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు ఓడించలేదు. ఈసారి ఆ రికార్డును తిరగరాయాలని సూర్యకుమార్ యాదవ్ సేన భావిస్తోంది. మరోవైపు తొలిసారి టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడాలని కివీస్ చూస్తుంది.  
 

©️ VIL Media Pvt Ltd.