Reading Time: < 1 minute
Telangana Government Fixing Tuition Fees For Be And Btech Courses In Private Unaided Colleges

తెలంగాణలో ఈఏపీసెట్ ప్రవేశాలకు సంబంధించి ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. తదుపరి మూడేళ్ల బ్లాక్ పీరియడ్ (2025-26, 2026-27, 2027-28) కోసం రాష్ట్రంలోని 160 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల ట్యూషన్ ఫీజులను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేస్తూ జీవో 6ను జారీ చేసింది. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (TAFRC) సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వచ్చే ఈ కొత్త ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఫీజును సీబీఐటీలో రూ. 1,83,000గా నిర్ణయించారు. మిగిలిన టాప్ కాలేజీల విషయానికొస్తే.. వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో రూ. 1,75,000, ఎంజీఐటీలో రూ. 1,67,000, సీవీఆర్ కాలేజీలో రూ. 1,63,000, జి.నారాయణమ్మలో రూ. 1,62,000, గోకరాజు గంగరాజులో రూ. 1,60,500, వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో రూ. 1,59,600, బీవీరాజు ఇనిస్టిట్యూట్‌లో రూ. 1,46,600, కిట్స్‌లో రూ. 1,46,200 మరియు ఎంవీఎస్ఆర్ కాలేజీలో రూ. 1,43,800 చొప్పున ఫీజులు నిర్ణయించారు.

Also Read:మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో Realme C83 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

మొత్తంగా పరిశీలిస్తే.. 126 కాలేజీల్లో ఫీజు రూ. లక్షలోపే ఉంది. సుమారు 19 కాలేజీల్లో అత్యల్పంగా రూ. 45,000 ఫీజును ఖరారు చేశారు. 70 కళాశాలల్లో పాత ఫీజులే కొనసాగుతుండగా.. 63 కాలేజీల్లో ఫీజులు పెరిగాయి.. మిగిలిన వాటిలో తగ్గుదల నమోదైంది.

విద్యార్థులపై భారం తగ్గించేందుకు ఫీజును ఒకేసారి కాకుండా వాయిదాల పద్ధతిలో చెల్లించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. నిర్ణీత ఫీజు కంటే అదనంగా క్యాపిటేషన్ ఫీజు లేదా విరాళాల పేరుతో ఒక్క రూపాయి వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. కాలేజీలు సమర్పించిన ఆదాయ, వ్యయ లెక్కలను బట్టి ఫీజులు ఖరారు చేశామని.. లెక్కల్లో తప్పులుంటే భవిష్యత్తులో ఫీజు తగ్గింపుతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.