Reading Time: < 1 minute
Ghaffoors Son Kiran Dies Of Heart Attack In California Usa

MA Ghaffoor’s Son Kiran Dies in US: సీపీఎం సీనియర్‌ నేత, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎంఏ గఫూర్‌, ఐద్వా నేత నిర్మల కుమారుడు కిరణ్(41) అమెరికాలోని కాలిఫోర్నియాలో గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో నివసిస్తున్న కిరణ్ అక్టోబర్ 1న మరణించినట్లు తల్లిదండ్రులకు ఆలస్యంగా తెలిసింది. గత పది రోజులుగా కుమారుడి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు అమెరికాలోని తెలుగు సంఘాల ప్రతినిధులను సంప్రదించారు.

ఉన్నత విద్య అభ్యసించి.. అమెరికాలో ఉద్యోగం
కిరణ్ విద్యాపరంగా మంచి ప్రతిభ కనబరిచారు. చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ మద్రాస్)లో ఎం.టెక్ పూర్తి చేశారు. అనంతరం న్యూయార్క్ యూనివర్సిటీలో డేటా సైన్స్ విభాగంలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆ తర్వాత ప్రముఖ సంస్థ పేపాల్‌లో సీనియర్ డేటా సైంటిస్టుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో నివాసం ఉంటున్న కిరణ్ మృతి వార్త కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచింది.

పది రోజులుగా సమాచారం లేకపోవడంతో ఆందోళన
గత పది రోజులుగా కిరణ్ నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో ఆయన గఫూర్‌, నిర్మల దంపతులు ఆందోళనకు గురయ్యారు. దీంతో అమెరికాలోని అమనా (AMANA), తానా (TANA) ప్రతినిధులను సంప్రదించారు. వారు వెంటనే స్పందించి వివరాలు సేకరించడంతో అక్టోబర్ 1వ తేదీనే కిరణ్ మరణించినట్లు నిర్ధారణ అయినట్లు సమాచారం. గుండెపోటు కారణంగా ఆయన మృతి చెందినట్లు తల్లిదండ్రులకు తెలియజేశారు.

కిరణ్ భౌతికకాయాన్ని కర్నూలుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు
కిరణ్ భౌతికకాయాన్ని అమెరికా నుంచి కర్నూలుకు తీసుకురావడానికి అమనా, తానా ప్రతినిధులు సహకరిస్తున్నారు. అయితే, అమెరికాలో వరుసగా మూడు రోజుల సెలవులు ఉండటంతో అవసరమైన ప్రక్రియలకు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కిరణ్ భౌతికకాయం కర్నూలుకు చేరుకోవడానికి సుమారు వారం రోజులు పట్టవచ్చని తెలుస్తోంది. చిన్న వయసులోనే ఉన్నత విద్యను అభ్యసించి, విదేశాల్లో సీనియర్ డేటా సైంటిస్టుగా పనిచేస్తున్న కిరణ్ మరణవార్త అతని కుటుంబ సభ్యులు, బంధువులను తీవ్ర విషాదంలో ముంచింది.