Reading Time: 2 minutes
Highest Successful T20i Run Chases West Indies Make History Vs India

Highest Successful T20I Run Chases List in T20: భారత్‌పై వెస్టిండీస్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం రాత్రి రాంచీ వేదికగా జరిగిన రెండో టీ20లో కెప్టెన్ షాయ్ హోప్ (102) అజేయ శతకంతో చెలరేగడంతో కరీబియన్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 250 పరుగుల భారీ లక్ష్యాన్ని వెస్టిండీస్ 18.3 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ 1-1తో సమమైంది. టీమిండియా భారీ స్కోరు చేసినప్పటికీ.. బౌలింగ్‌లో లక్ష్యాన్ని కాపాడుకోలేకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఇక భారత్‌పై టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఇదే అత్యధిక విజయవంతమైన ఛేదనగా నిలిచింది.

ఈ విజయంతో పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక లక్ష్యాలను ఛేదించిన జట్ల జాబితాలో వెస్టిండీస్‌ రెండో స్థానానికి చేరింది. 2023లో దక్షిణాఫ్రికాపై సెంచూరియన్‌లో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ నిర్దేశించిన 259 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన దక్షిణాఫ్రికా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు భారత్‌పై 250 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన వెస్టిండీస్‌.. ఈ రెండో స్థానంలో నిలిచింది. 2018లో ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా 244 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. 244 స్కోరును 2025లో బల్గేరియా జట్టు జిబ్రాల్టర్‌పై సోఫియాలో ఛేదించింది.

పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక లక్ష్య ఛేదనల జాబితాలో పసికూన బల్గేరియా కూడా ఉంది. 2022లో సెర్బియాపై బల్గేరియా 243 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. 2015లో జొహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్‌ 232 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగా, 2016లో ముంబైలో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్‌ 230 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా అందుకుంది. ఇప్పటివరకు వెస్టిండీస్‌ అత్యధిక లక్ష్య ఛేదన 232గా ఉండగా.. తాజాగా పటిష్ట భారత్‌పై 250 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించింది. విండీస్ ఊపు చూస్తే.. లక్ష్యం ఇంకా పెద్దదయితే దక్షిణాఫ్రికా రికార్డు కూడా బద్దలయ్యేదే.

పురుషుల అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో అత్యధిక ఛేజింగ్ లిస్ట్ ఇదే:
259 – దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్, సెంచూరియన్, 2023
250 – వెస్టిండీస్ vs భారత్, రాంచీ, 2026
244 – ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్, ఆక్లాండ్, 2018
244 – బల్గేరియా vs జిబ్రాల్టర్, సోఫియా, 2025
243 – బల్గేరియా vs సెర్బియా, సోఫియా, 2022
232 – వెస్టిండీస్ vs దక్షిణాఫ్రికా, జోహన్నెస్‌బర్గ్, 2015
230 – ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా, ముంబై WS, 2016