
Fauzi vs Spirit Release Dates: ‘రెబల్ స్టార్’ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఫౌజీ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా.. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న ఫౌజీ నుంచి ప్రత్యేక గ్లింప్స్ విడుదలయ్యే అవకాశముందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచార చిత్రంతో పాటు సినిమా విడుదల తేదీపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం.
నిజానికి ఫౌజీ చిత్రాన్ని డిసెంబరులో విడుదల చేయాలని భావించినప్పటికీ.. చిత్రీకరణ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. ఈ సినిమాను 2027 మార్చి మూడో వారంలో ( మార్చి 18) విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం ‘స్పిరిట్’ విడుదల తేదీ విషయంలో ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హైఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌ను 2027 మార్చి 5న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే ఫౌజీ కూడా మార్చి 18న విడుదలైతే.. రెండు సినిమాల మధ్య కేవలం 13 రోజుల వ్యవధి మాత్రమే ఉంటుంది. దీంతో స్పిరిట్ విడుదల తేదీలో మార్పు ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
స్పిరిట్‌లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. పోలీస్ కథకు మాఫియా నేపథ్యాన్ని జోడిస్తూ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రీ కథానాయికగా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మొత్తంగా ఫౌజీ గ్లింప్స్, విడుదల తేదీపై రానున్న ప్రకటన కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఫౌజీ మార్చి 18న విడుదలైతే స్పిరిట్ షెడ్యూల్‌లో మార్పు ఉంటుందా? లేక రెండు సినిమాలు ప్రకటించిన తేదీల్లోనే ప్రేక్షకుల ముందుకు వస్తాయా? అనేది అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే స్పష్టమవుతుంది.