
ఇప్పుడు దేశమంతా ఒకటే ప్రశ్న.. రాజధాని ఢిల్లీలో ఏం జరగబోతోంది..? జంతర్ మంతర్ 2.O అంటూ కాక్రోచ్ లు కదం తొక్కేందుకు సిద్ధమైన వేళ.. అడుగడుగునా అరెస్టులు, నిర్బంధాలతో పోలీసులు దడ పుట్టిస్తున్నారు. వెయ్యి కాదు పదివేలు కాదు.. ఏకంగా 40 వేల మంది పోలీసులు పహారా కాస్తున్నారు.. నీట్ నిరసనల మాదిరిగా కాకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని పోలీసులు.. నీట్ కు మించీ.. జంతర్ మంతర్ 2.O అంటున్న సీజేపీ.. ఈ క్రమంలో ఢిల్లీకి నిరసన కారులను రాకుండా చేసేందుకు రైళ్లు రద్దు చేయడం.. 57 మెట్రో స్టేషన్లు బందు పెట్టడం.. వార్తలు స్ప్రెడ్ కాకుండా ఇంటర్నెట్ బంద్.. ఇలా ఢిల్లీలో ప్రస్తుతం సునామీకి ముందు ఉండే నిశ్చబ్దం కనిపిస్తోంది.
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళకు పిలుపునిచ్చిన వేళ 2026 అక్టోబర్ 10న ఢిల్లీ రణరంగంగా మారింది. దేశ నలుదిక్కుల నుంచి సీజేపీ మద్ధతుదారులు ఢిల్లీవైపు కదం తొక్కుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ ఎంట్రెన్స్ లలో వేల మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సంసద్ మార్గ్ నుంచి జంతర్ మంతర్ వరకు వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
సీజేపీ తలపెట్టిన ర్యాలీకి అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు తేల్చిచెప్పారు. నిబంధనల ప్రకారం 10 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వలేదని, గతంలో జరిగిన నిరసనల్లో నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నతాధికారులు ప్రకటించారు. సెంట్రల్ ఢిల్లీలోని పలు సున్నిత ప్రాంతాల్లో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 విధించారు. ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
57 మెట్రో స్టేషన్లకు తాళం
ఆందోళనకారులు సెంట్రల్ ఢిల్లీకి చేరుకోకుండా ఉండేందుకు శనివారం (అక్టోబర్ 10) 57 కీలక మెట్రో స్టేషన్లను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచే ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను క్లోజ్ చేయనున్నట్టు ప్రకటించారు. రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియెట్, న్యూఢిల్లీ, పటేల్ చౌక్, జన్పథ్, మండి హౌస్, కశ్మీరీ గేట్, ఐటీవోలాంటి నిత్యం రద్దీగా ఉండే ప్రధాన ఇంటర్చేంజ్ స్టేషన్లు మూతపడనుండటంతో నిత్య ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నడిచే మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ కూడా తగ్గనుంది.
రైల్వే వ్యవస్థపైనా ఈ ఆందోళనల ప్రభావం భారీగా పడింది. న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్లకు చేరుకోవాల్సిన సుమారు 61 రైళ్లను శుక్ర, శనివారాల్లో రద్దు చేశారు. శుక్రవారం 40 రైళ్లు, శనివారం 21 రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్టు అధికారులు వెల్లడించారు. శనివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాబోయే రైళ్లను.. ఆయా ప్రారంభ స్టేషన్ల వద్దే నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తమ ప్రయాణాలను సరిచూసుకోవాలని రైల్వే శాఖ సూచనలు జారీ చేసింది. జంతర్ మంతర్‌కు చుట్టు నాలుగు కిలోమీటర్ల పరిధిలో 24 గంటల పాటు ఇంటర్ నెట్ సేవలను నిలిపివేశారు.
మరోవైపు ఢిల్లీ నగరమంతటా మునుపెన్నడూ లేని రీతిలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు 221 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలు, అదనంగా మరో 110 కంపెనీల బలగాలు, సాయుధ జవాన్లు మోహరించారు. ఇందులో సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బీ, ఐటీబీపీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు ఉన్నాయి. పలుచోట్ల మల్టీ లెవెల్ బారికేడ్లు, కంట్రోల్ రూమ్ నుంచి సీసీటీవీల నిఘా, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పొరుగు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, హర్యానా పోలీసులకు కూడా హై అలర్ట్ ప్రకటించారు.