Reading Time: < 1 minute
Abhijeet Dipke Saurabh Das Ranka Detained Delhi Cjp Protest Jantar Mantar

CJP Protest: ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే అభిజీత్ దిప్కే, సౌరభ్ దాస్, రాంకాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏకంగా ఫ్లైట్ లోపలే పోలీసులు ఈ యాక్షన్ తీసుకోవడం గమనార్హం. “మేము ఎట్టి పరిస్థితుల్లోనూ తలవంచబోం” అంటూ పోలీసుల అదుపులో ఉన్న దీప్కే, సౌరభ్, రాంకాలు నినదించారు. ఇక, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టనున్న భారీ నిరసన ప్రదర్శనకు ముందే ఢిల్లీ పోలీసులు అప్రమత్తమై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీతో సహా ఇప్పటివరకు సుమారు 150 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఫౌండర్ అభిజీత్ దిప్కే ముంబైలోని తన ఇల్లు నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకోగానే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇలా ఎక్కడికక్కడ ప్రదర్శనకారులను పోలీసులు ఏరివేస్తూ నిర్బంధిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆందోళనకారులు జంతర్ మంతర్ చేరుకోకుండా ఢిల్లీ పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఢిల్లీ సరిహద్దులన్నింటి వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. వెళ్లే ప్రతి వాహనాన్ని ఆపి మరీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎవరి మీదైనా అనుమానం వస్తే చాలు, క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు.

మరోవైపు, ఈ నిరసనను అణచివేయడానికి ఢిల్లీ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కీలకమైన మెట్రో స్టేషన్లతో పాటు మార్కెట్లను కూడా మూసివేశారు. ఢిల్లీకి వచ్చే డజన్ల కొద్దీ రైళ్లను రద్దు చేయడంతో పాటు, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. అంతేకాకుండా, నిరసనకారులు ఎవరూ ఢిల్లీకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ఇటువంటి కట్టుదిట్టమైన భద్రతా వలయాల మధ్యే అభిజీత్ దిప్కే, సౌరభ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీలను పోలీసులు అరెస్ట్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది.