Reading Time: 2 minutes
Delhi Cjp Protest Train Cancellations Passengers Stranded 170 Trains Cancelled

Delhi CJP Protest: ‘రాత్రి నుంచి తిరుగుతున్నాం.. ఇల్లు చేరడం కష్టమైపోయింది’.. ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ నిరసనల కారణంగా జనజీవనం ఎలా అస్తవ్యస్తమైందో చెబుతున్న మాటలివి. ఢీల్లీలో సీజేపీ ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతను పెంచడంతో పాటు 170కి పైగా లోకల్, షార్ట్ డిస్టెన్స్ రైళ్లను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుజరాత్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు ఘజియాబాద్ వెళ్లాల్సి ఉంది. నిజాముద్దీన్ స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి లోకల్ రైలు పట్టుకోవాలని అనుకున్నాడు. కానీ అక్కడ రైళ్లు లేకపోవడంతో ఆటో, రిక్షా పట్టుకుని కొత్త దిల్లీ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. తీరా ఇక్కడకు వచ్చాక చూస్తే.. ఇక్కడ కూడా రైళ్లు రద్దయ్యాయని తెలిసి లబోదిబోమన్నాడు. మరో ప్రయాణికుడి పరిస్థితి కూడా అలాగే ఉంది. రైళ్లు రద్దు అవుతాయన్న ముందస్తు సమాచారం లేకపోవడంతో ఏం చేయాలో తోచక అయోమయంలో పడ్డాడు. లక్నో వెళ్లి అక్కడి నుంచి వేరే రైలు చూసుకోవాలని, కుదరకపోతే బస్సులో వెళ్లాలని ఆలోచిస్తున్నాడు. స్టేషన్‌లోని డిస్‌ప్లే బోర్డులపై వరుసగా రైళ్లు రద్దయిన వివరాలే కనిపిస్తుండటంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకులాట మొదలుపెట్టారు.

కేవలం రైళ్లే కాదు, రోడ్డు మార్గంలో ప్రయాణించేవారికి కూడా చుక్కెదురైంది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు రావడం కోసం ట్యాక్సీ బుక్ చేసుకున్నాడు. కానీ దారిలో విపరీతమైన ట్రాఫిక్, పోలీసులు ఎక్కడపడితే అక్కడ ఆంక్షలు విధించడంతో ట్యాక్సీ డ్రైవర్ మధ్యలోనే అతన్ని దించి వెళ్లిపోయాడు. దీంతో మరో ట్యాక్సీ వెతుక్కుని స్టేషన్‌కు చేరుకోవడానికి ఆ యాత్రికుడు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఇక రాజస్థాన్‌లోని భిల్వారా నుంచి ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన మనీష్ అనే వ్యక్తికి జైపూర్ స్టేషన్‌లోనే పోలీసులు ఎదురయ్యారు. ఎక్కడికి వెళ్తున్నారు, ఢీల్లీకి ఎందుకు వస్తున్నారు అని పోలీసులు ఆరా తీశారు. ఢిల్లీకి వస్తున్న చాలా మందిని దారిలోనే అడ్డుకుంటున్నట్లు, అదుపులోకి తీసుకుంటున్నట్లు అతనికి సమాచారం అందింది. దీంతో ఆందోళన స్థలానికి ఎలా చేరుకోవాలనే టెన్షన్ అందరిలోనూ కనిపిస్తోంది. మరోవైపు. ఢిల్లీ సరిహద్దుల్లో, ముఖ్యంగా నోయిడా బోర్డర్ వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళనకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 223 సహా తదితర సెక్షన్ల కింద కఠిన చర్యలు తీసుకుంటామని, ఢీల్లీకి వచ్చే వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఆందోళనకారులు గుమికూడాల్సి ఉండగా.. పోలీసుల ఆంక్షలు, రైళ్ల రద్దు నేపథ్యంలో జనం ఆందోళన స్థలానికి ఎంతవరకు చేరుకోగలరనే దానిపైనే అందరి దృష్టి నిలిచింది.