Reading Time: 2 minutes
మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషల్.. వారానికి ఒక్కసారైనా తినండి.. శరీరం ఉక్కులా మారిపోద్ది..

వీకెండ్ వచ్చిందంటే చాలు నాన్‌వెజ్ ప్రియుల ఇళ్లల్లో చికెన్, మటన్ ఉడకాల్సిందే.. కర్రీ, ఫ్రైతోపాటు.. పలు రకాలుగా వండుకుని తింటారు.. అయితే.. ముఖ్యంగా మటన్ బలమైన మాంసాహారం.. దీనిలో ప్రోటీన్ తోపాటు అనేక పోషకాలు దాగున్నాయి.. అయితే.. మేక – గొర్రె మాంసంలో అన్ని భాగాలు ప్రత్యేకమైనవే.. మాంసంతోపాటు.. తలకాయ, కాళ్లు, లివర్, తిల్లి, బోటి.. ఇలా అన్ని ఎన్నో పోషకాలతో నిండి ఉన్నాయి.. బలమైన ఆహారంలో తిల్లి ఒకటి.. దీనిలో అనేక పోషకాలు దాగున్నాయి.. మటన్ తిల్లి (మేక స్ప్లీన్) శరీరంలో రక్తాన్ని పెంచడానికి, రక్తహీనతను తగ్గించడానికి ఉపయోగపడే అత్యంత పోషకమైన ఆరోగ్యకరమైన ఆహార పదార్థమని ఆహార నిపుణులు చెబుతున్నారు.

తిల్లిలో ఎన్నో పోషకాలు..

మటన్ తిల్లిలో ఐరన్, ప్రొటీన్లు, విటమిన్ B12 పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనతను నివారిస్తాయి.. అంతేకాకుండా.. కండరాల బలానికి, శరీర కణాల మరమ్మతుకు అవసరమైన నాణ్యమైన ప్రొటీన్లు ఇందులో లభిస్తాయి. ఇంకా నరాల ఆరోగ్యానికి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.

మటన్ తిల్లి ఫ్రై, లేదా మేక ప్లీహముతో చేసే ఈ రుచికరమైన వంటకం కేవలం నోరూరించే భోజనమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల గని కూడా.. సాధారణంగా నెరడా ఫ్రై అని కూడా పిలువబడే ఈ వంటకం, శరీరాన్ని బలోపేతం చేసే ఐరన్, ప్రొటీన్, ఇతర ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటుంది. మటన్ టిల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తహీనత వంటి సమస్యలను నివారించవచ్చని, ముఖ్యంగా రక్తస్థాయిని పెంచడంలో ఇది అద్భుతమైనదని పెద్దలు పేర్కొంటుంటారు..

మటన్ తిల్లి ఫ్రై తయారీ విధానం:

ఈ పోషకభరితమైన వంటకాన్ని తయారుచేయడం చాలా సులభం.

  • ముందుగా ఒక పాన్‌లో నూనె వేడి చేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, మధ్యలోకి చీల్చిన పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చేవరకు బాగా మగ్గించుకోవాలి.
  • ఉల్లిపాయలు మగ్గిన తర్వాత, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయేంత వరకు వేగించాలి.
  • శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ టిల్లి, మటన్ లివర్, కిడ్నీ ముక్కలను వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ ముక్కలు సుమారు పావు కిలో వరకు ఉండవచ్చు.
  • కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి, బాగా కలిపి, మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. దీనివల్ల మాంసం ముక్కలు తమలోని నీటిని విడుదల చేసి, పాక్షికంగా ఉడుకుతాయి.
  • మాంసం కొద్దిగా మగ్గిన తర్వాత, మీ రుచికి సరిపడా కారం (రెండు టీస్పూన్ల వరకు) వేసి బాగా కలపాలి.
  • మాంసం ఉడకడానికి సరిపడినంత నీళ్లు పోసి, మళ్లీ మూత పెట్టి, మాంసం పూర్తిగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి.
  • చివరగా, కొద్దిగా కరివేపాకు, ఒక టీస్పూన్ ధనియాల పొడి, ఒక టీస్పూన్ గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి.
  • మీరు కర్రీ లాగా కావాలంటే ఈ దశలో వడ్డించవచ్చు.. కానీ కొంచెం దగ్గరికి, ఫ్రై లాగా కావాలంటే ఇంకొంచెం సేపు మూత పెట్టి ఉడికించాలి. దీనివల్ల రుచి మరింత పెరుగుతుంది. చివరిగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడి వేడిగా వడ్డించండి.

ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి, మటన్ టిల్లి వంటి ఆర్గాన్ మీట్లను మితంగా తినాలి. వీటిలో ప్రొటీన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.

ఈ మటన్ టిల్లి ఫ్రై కేవలం రుచిని అందించడమే కాదు, మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందించి, ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. రక్తహీనతతో బాధపడేవారు లేదా తమ రక్తస్థాయిని పెంచుకోవాలనుకునేవారు ఈ వంటకాన్ని తప్పకుండా ప్రయత్నించాలి. అయితే.. ఏమైనా సమస్యలుంటే ముందుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..