
ఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో లాక్ డౌన్ పరిస్థితులు తలపిస్తున్నాయి. రోడ్లపై వేల మంది పోలీసులు మోహరించారు. బారికేడ్లు పెట్టేసి ఎక్కడికక్కడ వెహికల్స్ చెక్ చేసి పంపిస్తున్నారు. కొన్ని రోడ్లను పూర్తిగా బ్లాక్ చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ఢిల్లీకి వచ్చే వందల రైళ్లను రద్దు చేశారు. ఢిల్లీలో అడుగడుగునా ఆంక్షలు విధించారు.
#WATCH | Delhi: Police maintain high security around Mohan Estate area ahead of the Cockroach Janta Party (CJP) protest today. Spike strips also installed here. https://t.co/PwCjc2g245
— ANI (@ANI) October 10, 2026
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలకు పిలుపునివ్వడంతో ఢిల్లీలో వాతావరణం వేడెక్కింది. శాంతియుతంగా నిరసన చేస్తామని కాక్రోచ్ జనతా పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ ఈ నిరసనలకు అసలు అనుమతే లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే, కాక్రోచ్ నిరసనలకు మద్దతు తెలిపిన యూట్యూబర్ ధృవ్ రాఠీలను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.
కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులను ఢిల్లీకి రానివ్వకుండా పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేశారు. ఢిల్లీ మెట్రో సేవలపై కూడా ఈ ప్రభావం పడింది. 57 మెట్రో స్టేషన్లను ఇప్పటికే తాత్కాలికంగా మూసివేశారు. ఢిల్లీలో వైన్ షాపులు బంద్ చేశారు. రోడ్డుపైకి వచ్చిన ప్రతీ వాహనాన్ని తనిఖీ చేశాకే పంపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులను ఢిల్లీ నగర వాసులు లాక్ డౌన్ సమయంలో చూశారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడే చూస్తున్నారు. ప్రజాస్వామ్య నిరసనలను కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం అణిచివేస్తుందని సీజేపీ, విపక్షాలు మండిపడ్డాయి. శాంతి భద్రతలను కాపాడటమే తమ లక్ష్యమని పోలీసులు తేల్చి చెబుతున్నారు. ఇలా సీజేపీ పిలుపునిచ్చిన ఆందోళన జరగకపోయినప్పటికీ ఢిల్లీలో వాతావరణం అంతకు మించే వేడెక్కింది.
ఢిల్లీ నగరమంతటా మునుపెన్నడూ లేని రీతిలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు 221 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలు, అదనంగా మరో 110 కంపెనీల బలగాలు కలిపి మొత్తం 23వేల మందికి పైగా సాయుధ జవాన్లు మోహరించారు. ఇందులో సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బీ, ఐటీబీపీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు ఉన్నాయి. పలుచోట్ల మల్టీ లెవెల్ బారికేడ్లు, కంట్రోల్ రూమ్ నుంచి సీసీటీవీల నిఘా, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పొరుగు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, హర్యానా పోలీసులకు కూడా హై అలర్ట్ ప్రకటించారు.