Reading Time: < 1 minute

కొందరికి దేశద్రోహి.. మరికొందరికి జాతీయ హీరో: ఉమర్ ఖాలిద్‌కు ఫ్రంట్ లైన్ డిఫెండర్స్ అవార్డు

Caption of Image.

ప్రముఖ కార్యకర్త ఉమర్ ఖాలిద్‌కు అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. గత 6 ఏళ్లుగా జైలులో ఉంటున్న ఆయన.. 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన ‘ఫ్రంట్ లైన్ డిఫెండర్స్ అవార్డు’ను గెలుచుకున్నారు. ఆసియా ప్రాంతం నుంచి ఈ అవార్డుకు ఉమర్ ఖాలిద్ ఎంపికైనట్లు అక్టోబర్ 8న సంస్థ అధికారికంగా ప్రకటించింది.

అరాచక, రాజ్యాంగ విరుద్ధమైన పౌరసత్వ సవరణ చట్టానికి(CAA) వ్యతిరేకంగా శాంతియుత ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించినందుకే ఉమర్ ఖాలిద్ గత 6 సంవత్సరాలుగా కటకటాల వెనుక మగ్గవలసి వస్తోందని అవార్డు కమిటీ అభిప్రాయపడింది. కొందరికి ఆయన ‘దేశద్రోహి’గా కనిపిస్తున్నప్పటికీ.. మరికొందరికి మాత్రం ఆయనో జాతీయ హీరో అని, ప్రజల గొంతుక అని సంస్థ కొనియాడింది.

ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో 2020 సెప్టెంబర్ 14న ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ ఉమర్ ఖాలిద్‌ను అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉంటున్నారు. ఆయనపై ఉపా, దేశద్రోహం, హత్యాయత్నం వంటి తీవ్రమైన అభియోగాలు మోపారు. 2019-2020లో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ఉమర్ ఖాలిద్ కీలక పాత్ర పోషించారు. హిందూ జాతీయవాద వాతావరణంలో ముస్లింల పౌరసత్వాన్ని దెబ్బతీసే ఈ చట్టానికి వ్యతిరేకంగా గళం విప్పినందుకే ఆయనపై ఈ నిర్బంధం కొనసాగుతోందని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. ఆయన అరెస్ట్ చట్టవిరుద్ధమని ఐక్యరాజ్యసమితి వర్కింగ్ గ్రూప్ కూడా గతంలో పేర్కొంది.

డబ్లిన్‌లోని ట్రినిటీ కాలేజీలో జరిగిన ప్రత్యేక వేడుకలో ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఉమర్ ఖాలిద్ తరఫున ఆయన తండ్రి సయ్యద్ ఖాసిమ్ రసూల్ ఇల్యాస్ ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఉమర్ ఖాలిద్‌తో పాటు ఆఫ్రికా నుంచి లరిండా మాన్యువల్, అమెరికా నుంచి అద్దా విక్టోరియా, యూరప్ నుంచి లిల్జానా నెసిక్, మిడిల్ ఈస్ట్ నుంచి అహ్మద్‌రెజా హేరి తదితరులు ఈ అవార్డును దక్కించుకున్నారు.

ఢిల్లీ హైకోర్టు సెప్టెంబర్ 20న ఉమర్ ఖాలిద్ బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. అయితే మే నెలలో తల్లి శస్త్రచికిత్స కోసం కోర్టు ఆయనకు కొద్దిరోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 
 

©️ VIL Media Pvt Ltd.