
రిజర్వ్ బ్యాంక్ దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని మరింత కట్టుదిట్టం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు రోజువారీగా నిర్వహించాల్సిన క్యాచ్ రిజర్వ్ రేషియో(CRR) కనీస నిల్వ నిబంధనను 90 శాతం నుంచి 99 శాతానికి పెంచింది రిజర్వు బ్యాంక్. ఈ కొత్త నిబంధన అక్టోబర్ 16 నుంచి అమల్లోకి రానుంది.
గతంలో ఉన్న నిబంధనల ప్రకారం.. బ్యాంకులు 15 రోజుల రిపోర్టింగ్ కాలంలో సగటున నిర్దేశిత CRRను కాపాడుకుంటూనే.. ఒక్కో రోజు మాత్రం కనీసం 90 శాతం డబ్బు నిల్వలు ఉండేలా చూసుకునే వెసులుబాటు ఉండేది. ఉదాహరణకు.. ఒక వారంలో తక్కువ నిల్వలు ఉంచినా, మరో వారంలో ఎక్కువ నిల్వలు ఉంచడం ద్వారా సగటును సరిచేసుకునేవారు. కానీ తాజా సవరణతో ఈ రోజువారీ వెసులుబాటు కేవలం 1 శాతానికి పరిమితమైంది. అంటే 99 శాతం మెయింటైన్ చేయాలి క్యాష్. దీనివల్ల బ్యాంకులు తమ రోజువారీ లిక్విడిటీ నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది.
ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న అదనపు లిక్విడిటీ అంటే అందుబాటులో ఉన్న డబ్బును అదుపులో ఉంచడమే. అగస్టు, సెప్టెంబర్ నెలల్లో విదేశీ మూలధన ప్రవాహాల కారణంగా బ్యాంకింగ్ వ్యవస్థలో సర్ప్లస్ లిక్విడిటీ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అక్టోబర్ 7న జరిగిన ద్రవ్య విధాన సమీక్షలో మాట్లాడుతూ.. రాబోయే ఆర్థిక సంవత్సరంలో సహజసిద్ధమైన కారకాల ద్వారా ఈ మిగులు లిక్విడిటీ లభ్యత క్రమంగా తగ్గుతుందని తెలిపారు.
అయితే ఆర్‌బీఐ ఈ నిర్ణయం ద్వారా మొత్తం CRR శాతాన్ని పెంచలేదని, కేవలం రోజువారీ నిర్వహణ నిబంధనలను మాత్రమే కఠినతరం చేసిందని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ చీఫ్ ఎకానమిస్ట్ గౌర సేన్‌గుప్తా మాట్లాడుతూ.. ఈ చర్య ద్వారా రోజువారీగా లిక్విడిటీ వ్యవస్థను నియంత్రించడానికి వీలవుతుందని, అయితే దీనివల్ల పెద్దఎత్తున ద్రవ్య లభ్యతకు ఎలాంటి ఇబ్బంది కలగదని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం లిక్విడిటీ అడ్జస్ట్‌మెంట్ ఫెసిలిటీ(LAF) కింద నికర మిగులు సగటున రూ. 5లక్షల 90వేల కోట్లుగా ఉండగా.. తాజా డేటా ప్రకారం ఇది రూ. 3లక్షల 92 వేల కోట్లకు చేరింది. ద్రవ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వేరియబుల్ రేట్ రివర్స్ రెపో ఆక్షన్‌లు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ వంటి తగిన సాధనాలను భవిష్యత్తులోనూ ఉపయోగించనున్నట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది.