Reading Time: < 1 minute

పల్లెబాట పట్టిన జనం.. హైదరాబాద్ లో కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు..

Caption of Image.

దసరా సెలవులు వచ్చేశాయి.. ఇవాళ్టి ( అక్టోబర్ 10 )  నుంచే స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు కావడంతో సిటీ నుంచి సొంతూళ్లకు బయలుదేరారు జనం. దీంతో హైదరాబాద్ లోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిసాయి. పండగకు సొంతూళ్లకు బయలుదేరిన జనంతో MGBS, JBS బస్టాండ్లతో సహా కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లలో రద్దీ పెరిగింది.

ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ రూట్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. విజయవాడ, విశాఖ, తిరుపతి వెళ్లే ప్రయాణికులతో సందడి నెలకొంది. ఇటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ రూట్లలోనూ రద్దీ నెలకొంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సుల ఏర్పాట్లు ఏర్పాటు చేసింది ఆర్టీసీ. పండుగ రద్దీ నేపథ్యంలో ప్రయాణికుల భద్రత, సౌకర్యాలపై దృష్టి పెట్టారు అధికారులు.

తెలంగాణాలో స్కూళ్లకు ఈ నెల 22 వరకు, ఇంటర్ కాలేజీలకు 21 వరకు సెలవులు ప్రకటించారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ కాలేజీలకు 25 వరకు హాలిడేస్ ఇచ్చారు. ఇతర వర్సిటీలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. కొన్ని అటానమస్ ఇంజినీరింగ్ కాలేజీలకు ఈ నెల 17 నుంచి 20 వరకు సెలవులు ప్రకటించారు. దీంతో విద్యార్థులు సొంతూళ్లకు బయలుదేరగా, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి.

ప్రైవేట్ విద్యాసంస్థలు టీచర్లకు కూడా దసరా సెలవులు అమలు చేయాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ఫెడరేషన్ (టీపీటీఎల్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు విజయ్కుమార్ కోరారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు శనివారం నుంచి ఈ నెల 21 వరకు 12 రోజులపాటు సెలవులు ప్రకటిస్తూ మహిళా, శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సెలవుల తర్వాత ఈ నెల 22 నుంచి కేంద్రాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. చిన్నారులు, గర్భిణులు, 12 రోజులకు సరిపడా సరుకులను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
 

©️ VIL Media Pvt Ltd.