Reading Time: 2 minutes
Eci Form 7 New Rule Voter List Objections 10 Application Limit

Election Commission: సీజేపీ నిరసనల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఓటర్ల జాబితా నుంచి ఫేక్ లేదా తప్పుడు సమాచారంతో పేర్లను తొలగించేందుకు జరిగే ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు భారత ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒక వ్యక్తి ఫారమ్-7ను గరిష్టంగా 10 సార్లు మాత్రమే దాఖలు చేసేందుకు అనుమతినిస్తూ కొత్త పరిమితిని విధించింది. ఫారమ్-6 ప్రక్రియలో మార్పులు చేసిన అనంతరం ఎన్నికల కమిషన్ ఈ ఫారమ్-7 విషయంలో కూడా ఈ పెద్ద మార్పును తీసుకువచ్చింది. సాధారణంగా ఓటర్ల జాబితాలో ఒక వ్యక్తి పేరు చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేయడానికి లేదా అప్పటికే ఉన్న పేరును తొలగించాలని కోరడానికి ఈ ఫారమ్-7ను ఉపయోగిస్తారు. ఈ ఫారమ్ ఆధారంగా బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, ఆ పేరును జాబితా నుంచి తొలగించాలా వద్దా లేదా కొత్తగా చేర్చాలా అనేదానిపై అంతిమ నిర్ణయం తీసుకుంటారు.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో కొందరు వ్యక్తులు పెద్ద ఎత్తున ఈ అప్లికేషన్లను సమర్పిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ముఖ్యంగా బళ్లారి నియోజకవర్గంలో ఒకే బీజేపీ కార్యకర్త ఫారమ్-7 కింద ఏకంగా 7,561 దరఖాస్తులను సమర్పించడం తీవ్ర కలకలం రేపింది. ఈ తరహా దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడానికే ఇప్పుడు ఈ కొత్త నిబంధనను తెచ్చారు. ఇకపై ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానం ఏదైనా సరే, ఒక వ్యక్తిగత ఓటరు గరిష్టంగా 10 దరఖాస్తులు మాత్రమే సమర్పించడానికి అవకాశం ఉంటుంది.

నిజానికి ఇంతకుముందు భౌతికంగా (ఫిజికల్) ఫారమ్-7 సమర్పించడానికి ఎలాంటి నిర్దిష్ట పరిమితి ఉండేది కాదు. ఏ నమోదుకృత ఓటరైనా బల్క్‌గా ఎన్ని దరఖాస్తులనైనా ఇచ్చేందుకు వీలుండేది. అయితే ఆన్‌లైన్ ద్వారా ఒకేసారి దరఖాస్తు చేసుకోవడానికి మాత్రం గతంలో 6 ఫారమ్‌ల పరిమితి ఉండేది. కానీ ఇప్పుడు రెండు మార్గాల్లోనూ గరిష్ట పరిమితిని 10కి కుదించారు. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ (RER) 1960లోని రూల్ 13(2) ప్రకారం.. ఏదైనా ఒక నియోజకవర్గ ఓటర్ల జాబితాలో కొత్త పేరు చేర్చడంపై అభ్యంతరం చెప్పాలన్నా లేదా అప్పటికే ఉన్న పేరును తొలగించాలని కోరాలన్నా, ఆ దరఖాస్తు చేసే వ్యక్తి పేరు తప్పనిసరిగా అదే నియోజకవర్గ ఓటర్ల జాబితాలో నమోదై ఉండాలి. ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూనే, ఓటర్ల జాబితా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ కొత్త 10 దరఖాస్తుల పరిమితిని ఎన్నికల సంఘం అమల్లోకి తెచ్చింది.