
సిమ్లా కొండల్లో పుట్టి పెరిగిన అమ్మాయి. సినిమాలంటే చిన్నప్పటి నుంచే ఆసక్తి. నటి కావాలన్నది చిన్ననాటి కల. అయితే ఆ కలను వృత్తిగా మార్చుకోవాలంటే ముందుగా కుటుంబాన్ని ఒప్పించాలి. ఆ తర్వాత ముంబైలో తనను తాను నిరూపించుకోవాలి. ఈ రెండు దశలను దాటిన ప్రతిభా రాంటా.. ఇప్పుడు హిందీ చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందుతున్న యువ నటిగా నిలిచింది. టెలివిజన్‌తో మొదలైన ఆమె ప్రయాణం ‘లాపతా లేడీస్’తో కీలక మలుపు తిరిగింది. ఆ తర్వాత ‘హీరామండి: ది డైమండ్ బజార్’, ‘ది రివల్యూషనరీస్’ వంటి ప్రాజెక్టులతో విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది.
సినిమాలపై ఆసక్తి ప్రతిభకు చిన్నతనంలోనే ఏర్పడింది. తండ్రితో కలిసి సినిమాలు చూడటం, పాటలకు నృత్యం చేయడం ఆమె బాల్యంలో భాగం. పాఠశాల కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేది. నెమ్మదిగా నటనపై ఆసక్తి పెరిగింది. తనకు నటి కావాలన్న విషయం మాత్రం చాలా ముందుగానే స్పష్టమైందని ప్రతిభ పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. సిమ్లాలోని కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ పాఠశాలలో చదువుకున్న ఆమె.. ఆ తర్వాత ముంబైలో ఫిల్మ్‌మేకింగ్ చదువుకుంది. నటిగా మారాలన్న ఆలోచనకు కుటుంబం మొదట పూర్తిగా మద్దతు ఇవ్వలేదు. సినిమా రంగంలో స్థిరపడటం ఎంత కష్టమో వారికి తెలుసు. అయినా ప్రతిభ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. 2019లో ముంబైకి వెళ్లిన ప్రతిభకు ఆ నగరం పూర్తిగా కొత్త. చదువుతో పాటు ఆడిషన్లు ఇవ్వడం మొదలుపెట్టింది. కొత్త వ్యక్తులను కలవడం, అవకాశాల కోసం ప్రయత్నించడం, తిరస్కరణలను ఎదుర్కోవడం.. ఇవన్నీ ఆమె కెరీర్ తొలి దశలోనే ఎదురయ్యాయి. కుటుంబం కూడా ఆమెకు ఒక గడువు పెట్టినట్లు ప్రతిభ చెప్పింది. నిర్ణీత సమయంలో అవకాశం రాకపోతే తిరిగి రావాల్సి ఉంటుందని చెప్పారట. ఆ ఒత్తిడి మధ్యే ఆమె ప్రయత్నాలు కొనసాగించింది. చివరకు టెలివిజన్‌లో అవకాశం దక్కింది.
టెలివిజన్‌తో నటనకు పునాది
‘కుర్బాన్ హువా’ సీరియల్‌తో ప్రతిభ టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘ఆధా ఇష్క్’లో కనిపించింది. రోజువారీ షూటింగ్ షెడ్యూల్, వేగంగా సన్నివేశాలు పూర్తి చేయాల్సిన పరిస్థితి ఆమెకు కెమెరా ముందు పనిచేయడంపై మంచి అవగాహన ఇచ్చాయి. టెలివిజన్ తనకు నటనలో ఒక రకమైన శిక్షణగా పనిచేసిందని ప్రతిభ చెప్పింది. పాత్రను అర్థం చేసుకోవడం నుంచి కెమెరా ముందు సహజంగా ఉండటం వరకు చాలా విషయాలు అక్కడే నేర్చుకుంది. ఈ అనుభవమే తర్వాత సినిమాల్లో ఆమెకు ఉపయోగపడింది.
‘లాపతా లేడీస్’తో మలుపు
కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్’ ప్రతిభ కెరీర్‌ను పూర్తిగా మార్చింది. జయ పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చిన ఆమె.. పలుదశల ఎంపిక తర్వాత ఆ పాత్రను దక్కించుకుంది. ఆమిర్ ఖాన్ నిర్మించిన ఈ చిత్రంలో స్పర్శ్ శ్రీవాస్తవ్, నితాన్షి గోయల్‌తో కలిసి నటించింది. సినిమాలో పెళ్లి తర్వాత తన జీవితంపై ప్రశ్నలు వేసుకుంటూ, తన భవిష్యత్తును తానే నిర్మించుకోవాలనుకునే యువతిగా జయ కనిపిస్తుంది. పాత్రలోని పట్టుదల, అమాయకత్వం, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిభ సహజంగా తెరపైకి తీసుకొచ్చింది. జయ పాత్రతో తనకు కొన్ని వ్యక్తిగత పోలికలు ఉన్నాయని ఆమె చెప్పింది. తన భవిష్యత్తు గురించి కుటుంబంతో భిన్నమైన ఆలోచన ఉన్నప్పటికీ నటనను ఎంచుకుని ముంబైకి వచ్చిన తన ప్రయాణం.. జయ పాత్రను అర్థం చేసుకోవడంలో ఉపయోగపడిందని వివరించింది. ‘లాపతా లేడీస్’ విడుదల తర్వాత ప్రతిభ నటనకు ప్రశంసలు వచ్చాయి. ముఖ్యంగా కొత్త నటిగా ఆమె చూపించిన సహజత్వం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఒకే సినిమాతో వచ్చిన గుర్తింపు ఆమెకు మరిన్ని అవకాశాలకు దారితీసింది.
‘ది రివల్యూషనరీస్’లో…
నిఖిల్ అద్వానీ రూపొందించిన ‘ది రివల్యూషనరీస్’లో ప్రతిభకు మరో విభిన్న అవకాశం లభించింది. స్వాతంత్ర్యోద్యమ నేపథ్యంలోని ఈ కథలో ఆమె ప్రతిభా లాహిరీ పాత్ర పోషించింది. రోహిత్ సరాఫ్, భువన్ బామ్, గుర్‌ఫతేహ్ పిర్జాదా తదితరులతో కలిసి నటించింది. చారిత్రక నేపథ్యం ఉన్న పాత్ర కావడంతో ఆ కాలాన్ని, మహిళా విప్లవకారుల పాత్రను అర్థం చేసుకోవడానికి ఆమె సిద్ధమైంది. ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నమైన బాడీలాంగ్వేజ్, ఆలోచనా విధానం అవసరమైన ఈ పాత్ర తనకు కొత్త సవాలుగా అనిపించిందని చెప్పింది.
ప్రతిభ కెరీర్‌లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘విష్కన్య’. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ఆమె ఎంచుకున్న ప్రాజెక్టులను గమనిస్తే.. కథ, పాత్రల విషయంలో ప్రయోగాలు చేయడానికి ప్రతిభ సిద్ధంగా ఉందని కనిపిస్తోంది. సిమ్లాలో మొదలైన కల ముంబైలో కెరీర్‌గా మారింది. టెలివిజన్ ఆమెకు అనుభవాన్ని ఇచ్చింది. ‘లాపతా లేడీస్’ గుర్తింపును తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ గుర్తింపును దాటి తన నటనా పరిధిని పెంచుకునే దిశగా ప్రతిభ అడుగులు వేస్తోంది.
ఒకే ముద్రలో ఉండకుండా..
తొలి సినిమా విజయాన్ని తన కెరీర్‌కు ఒకే నిర్వచనంగా మార్చుకోకుండా ప్రతిభ విభిన్న పాత్రలను ఎంచుకుంటోంది. సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ‘హీరామండి: ది డైమండ్ బజార్’లో కనిపించింది. ఆ తర్వాత వచ్చిన ప్రాజెక్టుల్లోనూ పాత్రకు ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకునే ప్రయత్నం చేసింది. తనకు పూర్తిగా పరిపూర్ణంగా ఉండే పాత్రల కంటే లోపాలు, సంక్లిష్టతలు ఉన్న పాత్రలే ఆసక్తికరంగా అనిపిస్తాయని ప్రతిభ చెప్పింది. నటిగా కొత్త అనుభవాలను పొందాలంటే ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకూడదనేది ఆమె ఆలోచన.