Reading Time: < 1 minute
Telangana: భయాన్ని గెలిచి.. ప్రాణదాతగా మారి.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న రైతు..

కామారెడ్డి జిల్లా ఆగస్ట్ 31: దేన్నైనా ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలి, ఎక్కడ ఓడిపోయామో అక్కడే గెలిచి చూపించాలి అంటుంటారు. అచ్చం అలాంటి నిర్ణయమే తీసుకున్నాడు కామారెడ్డి జిల్లా జంగంపల్లికి చెందిన రైతు మోహన్ రెడ్డి. పాము కాటుతో తండ్రిని కోల్పోయిన విషాదాన్ని తన బలంగా మార్చుకుని, ప్రస్తుతం స్నేక్ క్యాచర్‌గా మారి వేలాది మంది ప్రాణాలను కాపాడుతున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. చిన్నప్పటి నుంచి పాములంటే ఆమడ దూరం పరిగెత్తే మోహన్ రెడ్డి జీవితాన్ని ఒక విషాద ఘటన పూర్తిగా మార్చేసింది. మోహన్ రెడ్డి తండ్రి పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఆ తీవ్ర విషాదం నుంచి తేరుకున్న అతను, తనలాంటి పుట్టెడు బాధ మరే కుటుంబానికీ రాకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. తండ్రి ప్రాణాలు తీసిన పాములపై భయాన్ని పక్కనపెట్టి, వాటి గురించి పూర్తిగా తెలుసుకోవడం మొదలుపెట్టాడు.

వ్యవసాయం చేసుకునే మోహన్ రెడ్డి, పాములను చంపకుండా సురక్షితంగా పట్టి తరలించడంలో ప్రత్యేక నైపుణ్యం సాధించాడు. వ్యవసాయం చేస్తూనే స్నేక్ క్యాచర్‌గా మారి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇళ్లలోకి, పొలాల్లోకి వచ్చే పాములను అత్యంత చాకచక్యంగా పట్టుకుని, సమీపంలోని సురక్షిత ప్రాంతాల్లో విడిచిపెడుతున్నాడు.

ఇప్పటివరకు దాదాపు 5 వేలకు పైగా పాములను పట్టి సంరక్షించిన మోహన్ రెడ్డి, పాముల సంరక్షణలో తనదైన ముద్ర వేశాడు. కేవలం పాములను పట్టుకోవడమే కాకుండా, ప్రజల్లో పాముల పట్ల ఉన్న భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. విషపాములను ఎలా గుర్తించాలి.. ఒకవేళ పాము కాటుకు గురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు.పాములను చంపకుండా వాటి ప్రాణాలను, అదే సమయంలో మనుషుల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,