Reading Time: 2 minutes
Otr Ntv Telugu Andhra Pradesh Ap Politics 3

OTR: ఎమ్మెల్యే…. ఎంపీ…. మధ్యలో బీచ్‌. అదీ స్టోరీ. ఏంటి అర్ధం కాలేదా..? బాపట్ల ఎంపీ, అదే నియోజకవర్గం ఎమ్మెల్యే, వాళ్ళిద్దరి మధ్య సూర్యలంక బీచ్‌. అదన్నమాట సంగతి. బీచ్‌ సాక్షిగా ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య వార్‌ ముదురుతోందట. మొదట్నుంచి కాస్త తేడాగానే ఉన్నా… ఆ మధ్య కాస్త గ్యాప్‌ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరి మధ్య బీచ్‌ వార్‌ మొదలైంది. ఏంటా సముద్ర యుద్ధం? ఏ పాయింట్‌లో తేడా కొట్టింది? వేగేశన నరేంద్రవర్మ…బాపట్ల ఎమ్మెల్యే. తెన్నేటి కృష్ణప్రసాద్…. బాపట్ల ఎంపీ. ఇద్దరూ టీడీపీ తరపున పోటీ చేసి ఘన విజయం సాధించినవాళ్ళే. అధికార పార్టీకి చెందిన వాళ్ళే కావడంతో.. జోడెడ్లలా నడుస్తూ… అభివృద్ధి చేస్తారని ఆశించారు జనం.

కానీ… వాస్తవ పరిస్థితులు మాత్రం చాలా తేడాగా ఉన్నాయన్నది నియోజకవర్గంలో ఉన్న విస్తృతాభిప్రాయం. గెలిచిన కొద్ది నెలల్లోనే ఇద్దరిమధ్య ఆధిపత్య పోరు మొదలైంది. బాపట్ల… జిల్లా కేంద్రం కావడంతో రియలెస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో… అన్ని రకాల అనుమతులు తీసుకోకుండా ఎవరైనా… వెంచర్లు వేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే నరేంద్రవర్మ రియల్ వ్యాపారులకు మీటింగ్‌లో క్లారిటీగా చెప్పేశారు. దాంతో… ఆయనేంటి, రూల్స్‌ గీల్స్‌ అంటారంటూ… కొంతమంది రియల్టర్లు ఎంపీ కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళారట. అప్పట్నుంచి ఇద్దరి మధ్య విభేదాలు మొదలైనట్టు చెప్పుకుంటున్నారు.

ఆ తర్వాత ఇసుక, బుసక తవ్వకాల వ్యవహారంలో ఎమ్మెల్యే, ఎంపీ వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు గట్టిగానే జరిగిందని టీడీపీ వర్గాలే చెప్పుకుంటాయి. లిక్కర్ షాపుల వ్యవహారంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ఆ రకంగా ఒకదానికి ఒకటి తోడై… బాపట్ల టీడీపీలో ఎమ్మెల్యే, ఎంపీ వర్గాలుగా వేరు కుంపట్లు మొదలయ్యాయి. ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇక తాజాగా ఎంపీ, ఎమ్మెల్యే మధ్యకు బీచ్‌ మేటర్స్ వచ్చాయి. సూర్యలంక బీచ్‌ అభివృద్ధి కోసం స్వదేశీ దర్శన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం సుమారు వందకోట్ల నిధులు మంజూరు చేసింది. వాటితో.. బీచ్ టూరిజం అభివృద్ధి కోసం రకరకాల పనులు జరుగుతున్నాయి. కానీ… ఉన్నట్టుండి ఎమ్మెల్యే నరేంద్ర వర్మ బీచ్‌లో జరుగుతున్న నిర్మాణ పనులను‌ పరిశీలించడం కలకలం రేపింది. ఆ తర్వాత ఆయన మీడియాలో మాట్లాడుతూ… పర్యాటకుల కోసం నిర్మిస్తున్న టాయిలెట్లు, ఇతర రెస్ట్‌ రూమ్స్‌ను తొలగించాలని ఒక ప్రజాప్రతినిధి అధికారులకు హుకుం జారీచేసినట్లు తనకు తెలిసిందన్నారు. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మాణాలు చేస్తుంటే… తొలగించాలని ఎలా ఆదేశిస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.

అయితే… ఇక్కడే అసలు కిటుకు ఉందట. బీచ్‌లో కొత్తగా హోటల్స్‌ నిర్మిస్తున్నారు. అందులోని ఒక హోటల్ ఎమ్మెల్యే చెబుతున్న సదరు ప్రజాప్రతినిధికి సంబంధించిన వాళ్ళదని, దాని ముందు టాయిలెట్స్‌ ఉంటే బాగోదన్న ఉద్దేశంతోనే అధికారులకు ఇలా చెప్పించి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం అవుతున్నాయి. ఆ ఉద్దేశ్యంతోనే నిర్మాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే… కోట్ల రూపాయలతో చేస్తున్న వాటిని తొలగించాలంటే తాను అంగీకరించేది లేదన్నారు. ఈ విషయాన్ని పర్యావరణ శాఖ మంత్రి, అధికారుల దృష్టికి‌ తీసుకెళ్తానని కూడా చెప్పేశారాయన. ఈ వ్యవహారంలో ఎంపీ హోటల్ మేనేజ్‌మెంట్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ చక్రం తిప్పుతున్నారని ఎమ్మెల్యే భావిస్తున్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన స్వయంగా రంగంలోకి దిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఎమ్మెల్యే కామెంట్స్‌తో బాపట్లలో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. హోటల్ యాజమాన్యానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడానికి ముందే టూరిజం అధికారులు నిర్మాణాలు మొదలుపెట్టారంటున్నారు. ఒకవేళ హోటల్ యాజమాన్యం ఇష్టపడకపోతే అదే ప్రాంతంలో హోటల్ నిర్మించేందుకు అనేకమంది సిద్దంగా ఉన్నారంటూ మాట్లాడారు ఎమ్మెల్యే. దీంతో ఈ వ్యవహారంలో తాను తగ్గేదేలేదన్నట్లుగా ఎమ్మెల్యే హింట్ ఇచ్చేసినట్లయ్యింది. ఇప్పుడు ఎంపీ ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది.