Reading Time: < 1 minute

సెప్టెంబర్ 2న పాయకరావుపేటకు సీఎం చంద్రబాబు…జలహారతి ఏర్పాట్లపై మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష…

Caption of Image.

సెప్టెంబర్ 2న సీఎం చంద్రబాబు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో పర్యటించనున్న క్రమంలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు అధికారులు. ఈ సందర్భంగా సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై హోం మంత్రి అనిత నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర,జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి వంటిదని అన్నారు. సెప్టెంబర్‌ 2న సీఎం చంద్రబాబు పాయకరావుపేట నియోజకవర్గానికి రానున్న క్రమంలో సీఎం పర్యటనలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులకు సూచించారు. సీఎం పర్యటనకు వేలాది మంది ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు కొల్లు రవీంద్ర .సభా ప్రాంగణం, రహదారులు, పార్కింగ్‌, తాగునీరు, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్‌ నియంత్రణ, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. 

గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తీసుకురావడం ద్వారా ఈ ప్రాంత వ్యవసాయానికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. సీఎం పర్యటనను విజయవంతం చేయడంతో పాటు జలహారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సమష్టిగా కృషి చేయాలని సూచించారు.

©️ VIL Media Pvt Ltd.