Reading Time: < 1 minute
తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనీ.. భార్యను చంపి సెప్టిక్ ట్యాంక్‌లో పాతిపెట్టాడు! అనాథలైన నలుగురు పిల్లలు

ధెంకనాల్, ఆగస్ట్‌ 30: గిరీష్, అతని భార్య శుక్రవారం సుభద్ర యోజన పథకం కింద జమ అయిన డబ్బులను తీసుకునేందుకు వెళ్లారు. అనంతరం ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత మద్యం కొనుగోలు చేసేందుకు తన భార్య వద్ద ఉన్న డబ్బులు ఇవ్వాలని గిరీష్ అడిగినట్లు సమాచారం. అయితే ఆమె డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన గిరీష్ కర్రతో భార్యపై దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దాడిలో ఆమె మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ దారుణ ఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఉదయం తల్లి కనిపించకపోవడంతో వారు ఆందోళనకు గురయ్యారు.

మునుపటి రోజు రాత్రి తమ తల్లిదండ్రుల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగిన విషయాన్ని పిల్లలు ఇరుగుపొరుగు వారికి తెలిపారు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు ఇంటి పరిసరాల్లో వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఇంటి వెనుక ఉన్న సెప్టిక్ ట్యాంక్ వద్ద మానవ చేయి బయటకు కనిపించడాన్ని వారు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఉదయం సుమారు 9 గంటల సమయంలో ఘటనాస్థలికి చేరుకున్నారు. ధెంకనాల్ అదనపు ఎస్పీ ఇందురేఖ ఈ ఘటనపై వివరాలు వెల్లడించారు. దంపతుల మధ్య గొడవ జరిగిందని, భర్త తన భార్యను హత్య చేసి ఇంటి వెనుక భాగంలో పాతిపెట్టినట్లు ప్రాథమికంగా గుర్తించామని ఆమె తెలిపారు.

సదర్ పోలీసులతో పాటు శాస్త్రీయ నిపుణుల బృందం ఘటనాస్థలికి చేరుకుని సెప్టిక్ ట్యాంక్ నుంచి మృతదేహాన్ని వెలికితీసింది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మహిళ మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. భార్య హత్య కేసులో గిరీష్ ప్రధాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు క్రైమ్ సీన్‌ను కూడా పోలీసులు రీక్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. హత్యకు దారితీసిన పరిస్థితులు, మహిళ మృతికి ఖచ్చితమైన కారణాలను పోస్టుమార్టం నివేదికతో పాటు ఇతర ఆధారాల ద్వారా పోలీసులు నిర్ధారించనున్నారు.