పప్పుచారు, సాంబార్ అన్నంలోకి నంజుకోవడానికే కాకుండా, వేడివేడి అన్నంలో నేరుగా కలుపుకుని తినడానికి, చపాతీ రోటీల్లోకి కూడా ఈ ఫ్రై సూపర్ కాంబినేషన్‌గా నిలుస్తుంది. తక్కువ నూనెతో, చిటికెలో చేసుకునే ఈ బీన్స్ ఫ్రై తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. కావలసిన పదార్థాలు: పావు కిలో తాజా బీన్స్ , 2 టేబుల్ స్పూన్లు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ఎండుకొబ్బరి ముక్కలు, 1 టీస్పూన్ కారం, 10 వెల్లుల్లి రెబ్బలు, తాలింపు గింజలు ఆవాలు, జీలకర్ర, మినపప్పు – 1 టీస్పూన్, ఒక ఎండుమిర్చి,రెండు రెమ్మల కరివేపాకు, అర టీస్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నూనె మరియు రుచికి సరిపడా ఉప్పు.
స్పెషల్ మసాలా పొడి తయారీ విధానం: స్టవ్ మీద పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసి మీడియం మంటపై దోరగా వేయించాలి. పల్లీలు సగం వేగిన తర్వాత అందులో ఒక రెమ్మ కరివేపాకు, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి చిటపటలాడే వరకు వేయించి మిక్సీ జార్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి.
చల్లారిన తర్వాత అందులో ఎండుకొబ్బరి ముక్కలు, ఒక టీస్పూన్ కారం వేసి కాస్త బరకగా మిక్సీ పట్టాలి. ఆ తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి మరోసారి పల్స్ మోడ్‌లో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.బీన్స్ ఫ్రై చేసే విధానం: పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు వేసి చిటపటలాడనివ్వాలి. ఆపై ఒక ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
ఇప్పుడు శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగిన పావు కిలో బీన్స్ ముక్కలు, తగినంత ఉప్పు వేసి మీడియం మంటపై 5 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు వేయించాలి.పచ్చివాసన పోయాక మూతపెట్టి మగ్గించాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నీళ్లను చిలకరించి మూతపెట్టి బీన్స్ ముక్కలు మెత్తబడే వరకు మరో రెండు మూడు నిమిషాలు ఉడికించాలి.
బీన్స్ మెత్తగా మగ్గిన తర్వాత అర టీస్పూన్ పసుపు, ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీ-నువ్వుల మసాలా కారప్పొడి వేసి బాగా కలపాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో ఘుమఘుమలాడే బీన్స్ ఫ్రై సిద్ధం! వేడివేడి అన్నం లేదా చపాతీతో ఆస్వాదిస్తే రుచి అద్భుతంగా ఉంటుంది!




