
- ఎలన్ మస్క్‌పై నమ్మకం లేదని ప్రకటన
న్యూఢిల్లీ: టెస్లా బాస్ ఎలన్ మస్క్, ఓపెన్ ఏఐ మధ్య గొడవ ముదురుతోంది. తాజాగా మస్క్ ఒక కంపెనీని కొనుగోలు చేయగా, ఆ కంపెనీకి నాలుగేళ్లుగా సేవలందిస్తూ వచ్చిన ఓపెన్ ఏఐ, తన వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీనికి కారణం మస్క్ సంస్థలపై తమకు నమ్మకం లేదని, తమ ఏఐ మోడళ్లను నిబంధనలకు అనుగుణంగా వాడతారనే నమ్మకం పోయిందని ఓపెన్‌ఏఐ ప్రకటించింది.
అసలు ఏం జరిగిందంటే, మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ కోడింగ్ ప్లాట్‌ఫామ్ ‘కర్సర్’ను తాజాగా కొనుగోలు చేయడంతో ఈ ప్లాట్‌ఫామ్‌తో వాణిజ్య భాగస్వామ్యాన్ని ఓపెన్ ఏఐ రద్దు చేసుకుంది. డెవలపర్లకు తగినంత సమయం ఇచ్చేందుకు వీలుగా ఈ ఏడాది నవంబర్ 12 వరకు ప్రస్తుత మోడళ్ల యాక్సెస్‌ను కొనసాగిస్తారు. ఆ తర్వాత ఏఐ మోడల్స్‌ను కర్సర్‌కు నిలిపివేస్తారు.
ఎప్పటినుంచో గొడవ
2015లో గూగుల్ వంటి కంపెనీలకు ప్రత్యామ్నాయంగా, సమాజ శ్రేయస్సు కోసం ఏఐను ఓపెన్ సోర్స్‌గా ఉంచాలనే లక్ష్యంతో ఎలన్ మస్క్, సామ్ ఆల్ట్‌మన్ కలిసి ఓపెన్‌ఏఐని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌గా స్థాపించారు. మస్క్ దీని కోసం ప్రారంభంలో సుమారు 44 మిలియన్ డాలర్ల వరకు నిధులు సమకూర్చారు. రీసెర్చ్ కోసం భారీగా నిధులు అవసరం పడటంతో , 2018లో మస్క్ ఓపెన్ ఏఐని టెస్లాలో విలీనం చేసి, పూర్తి నియంత్రణను తన చేతుల్లోకి తీసుకోవాలని ప్రతిపాదించారు. దీనికి ఆల్ట్‌మన్, ఇతర బోర్డు సభ్యులు నిరాకరించడంతో, మస్క్ బోర్డు నుంచి బయటకొచ్చేశారు.
మస్క్ బయటకొచ్చిన తర్వాత ఓపెన్‌ఏఐ ‘ఫర్–-ప్రాఫిట్’ విభాగాన్ని ఏర్పాటు చేసి, మైక్రోసాఫ్ట్ నుంచి బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు తీసుకుంది. దీని ద్వారా చాట్‌జీపీటీ వంటి ఉత్పత్తులను డెవలప్ చేసింది. డబ్బులు సంపాదించడం ప్రారంభించింది.
సమాజం కోసం మొదలైన ఓపెన్ సోర్స్ సంస్థను మైక్రోసాఫ్ట్‌కు అనుబంధ సంస్థగా, వ్యక్తిగత లాభాల కోసం మార్చేశారని మస్క్ ఆరోపిస్తూ కోర్టులో దావా వేశారు. మస్క్ గతంలో కంపెనీని ఫర్–-ప్రాఫిట్‌గా మార్చాలనుకున్నారని, కంపెనీ తన కంట్రోల్లో లేకపోవడంతో అసూయతో కేసులు వేస్తున్నారని ఓపెన్ ఏఐ వాదించింది.