
అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ దాడులు స్టార్ట్ కావటంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు మళ్లీ వణికిపోతున్నాయి. కీలక బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ ఉదయం 10.30 గంటల సమయంలో 410 పాయింట్లు కోల్పోగా, మరో కీలక సూచీ నిఫ్టీ 150 పాయింట్లు నష్టపోయింది. ఇక నిఫ్టీ బ్యాంక్ సూచీ 245 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 598 పాయింట్ల మేర నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. మార్కెట్లను నష్టాల దిశగా నడిపిస్తున్న కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
అమెరికా-ఇరాన్ టెన్షన్స్:
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అమెరికా బలగాలు ఇరాన్‌కు చెందిన 2 లాంచర్లపై జరిపిన దాడులతో గ్లోబల్ సెంటిమెంట్ పూర్తిగా దెబ్బతింది. జూలై చివరి వారం తర్వాత అమెరికా నేరుగా ఇరాన్‌పై దాడులకు దిగడం ఇదే మొదటిసారి కావడంతో.. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర సుమారు 2.5 శాతం ఎగబాకి బ్యారెల్‌కు 90 డాలర్లకు చేరుకుంది.
బలహీనమైన గ్లోబల్ సంకేతాలు:
యుద్ధ భయాలు ఆసియా మార్కెట్లను తీవ్రంగా కుదిపేశాయి. అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ రాజుకున్న ఘర్షణలు ప్రపంచ ఇంధన సరఫరాపై నీడలు కమ్ముకునేలా చేయడంతో ఆసియా ఈక్విటీలు భారీగా పడిపోయాయి. జపాన్ నిక్కీ సూచీ 2.1 శాతం, దక్షిణ కొరియా మార్కెట్లు 2.4 శాతం క్షీణించాయి. అమెరికా ఈక్విటీ ఫ్యూచర్స్ కూడా నష్టాల బాట పట్టగా.. ఎస్&పి 500 ఫ్యూచర్స్ 0.3 శాతం, నాస్‌డాక్ ఫ్యూచర్స్ 0.5 శాతం మేర పడిపోయాయి.
FIIల అమ్మకాలు:
ఈ బలహీన గ్లోబల్ సంకేతాల ప్రభావం భారత మార్కెట్లపై కూడా పడింది. గ్లోబల్ రిస్క్ సెంటిమెంట్ మరింత దిగజారుతున్న తరుణంలో.. ఫారెన్ ఇన్వెస్టర్లు శుక్రవారం ఒక్కరోజే రూ.5వేల కోట్లకు పైగా విలువైన భారతీయ ఈక్విటీలను విక్రయించి మార్కెట్‌కు మరో పెద్ద సమస్యగా మారారు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఊహించని రీతిలో తిరోగమనంలో కొనసాగుతున్నాయి.