Reading Time: 2 minutes
Vaibhav Sooryavanshi: కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ ఎంట్రీ.. 15 ఏళ్లకే బుడ్డోడి రికార్డ్..!

Vaibhav Sooryavanshi Captain: 15 ఏళ్ల వయసులోనే భారత క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది. దులీప్‌ ట్రోఫీ 2026 సెమీఫైనల్లో ఈస్ట్‌ జోన్‌కు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం అతడికి వచ్చింది. అసలు కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ గాయపడటంతో వైభవ్‌ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. దీంతో అత్యున్నత దేశవాళీ స్థాయిలో తొలిసారి కెప్టెన్సీ అనుభవాన్ని సొంతం చేసుకున్నాడు.

ఇషాన్‌ కిషన్‌కు ఏమైంది?

సెంట్రల్‌ జోన్‌తో జరుగుతున్న దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్లో వికెట్‌ కీపింగ్‌ చేస్తున్న సమయంలో ఇషాన్‌ కిషన్‌ కుడి మణికట్టుకు బంతి బలంగా తగిలింది. నొప్పితో ఇబ్బంది పడిన అతడిని ఫిజియో పరిశీలించాడు. అనంతరం ఇషాన్‌ మైదానం వీడాడు.

తర్వాత చేతికి పట్టీతో ఇషాన్‌ కనిపించాడు. అతడి స్థానంలో కుమార్‌ కుశాగ్ర వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు చేపట్టాడు. ఇదే సమయంలో జట్టు వైస్‌ కెప్టెన్‌గా ఉన్న వైభవ్‌ సూర్యవంశీకి నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.

15 ఏళ్లకే కెప్టెన్సీ బాధ్యతలు..!

ఇది వైభవ్‌కు ఎంతో ప్రత్యేకమైన సందర్భం. దులీప్‌ ట్రోఫీ కోసం ఈస్ట్‌ జోన్‌ జట్టును ప్రకటించిన సమయంలో ఇషాన్‌ కిషన్‌ను కెప్టెన్‌గా, వైభవ్‌ను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అప్పట్లోనే సెలెక్టర్లు ఈ యువ ఆటగాడికి నాయకత్వ లక్షణాలు పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ బాధ్యత ఇచ్చినట్లు వివరించారు.

ఎక్కువమంది చదివినది: Team India: జట్టు నుంచే కాదు, కెప్టెన్సీ పోస్ట్ కూడా పీకేస్తారనుకోలే..: సూర్య షాకింగ్ కామెంట్స్..!

అయితే ఇషాన్‌ గాయం కారణంగా వైభవ్‌కు ఊహించని విధంగా మరింత పెద్ద బాధ్యత దక్కింది. మ్యాచ్‌ మధ్యలోనే జట్టు పగ్గాలు చేపట్టి తన కెప్టెన్సీ ప్రయాణానికి శ్రీకారం చుట్టాడు.

‘వైస్‌ కెప్టెన్‌’ నుంచి ‘స్టాండ్‌ఇన్‌ కెప్టెన్‌’గా..

టోర్నీ ప్రారంభానికి ముందు వైభవ్‌కు వైస్‌ కెప్టెన్సీ ఇవ్వడంపై అప్పట్లోనే ఆసక్తి నెలకొంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఇంత పెద్ద బాధ్యత దక్కడం చర్చనీయాంశమైంది.

ఈ నియామకం అతడిపై ఒత్తిడి పెంచడానికి కాదని.. క్రమంగా నాయకత్వ బాధ్యతలకు సిద్ధం చేయడమే లక్ష్యమని ఈస్ట్‌ జోన్‌ సెలక్షన్‌ కమిటీ సభ్యులు వెల్లడించారు. వైభవ్‌కు గతంలోనూ బిహార్‌ ఫస్ట్‌క్లాస్‌ జట్టులో నాయకత్వ అనుభవం ఉందని తెలిపారు.

బ్యాట్‌తో తడబడినా.. బంతితో అదరగొట్టాడు!

దులీప్‌ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్లో వైభవ్‌ బ్యాట్‌తో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. నార్త్‌ఈస్ట్‌ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 8 పరుగులకే ఔటయ్యాడు. అయితే తర్వాత బంతితో తన సత్తా చాటాడు.

ఎడమచేతి ఆర్థడాక్స్‌ స్పిన్‌తో కేవలం మూడు ఓవర్లలో 2 వికెట్లు తీసి 11 పరుగులు ఇచ్చాడు. నాలుగు బంతుల వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టి ఈస్ట్‌ జోన్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

‘నాకు వికెట్లు తీయడం తెలుసు’ అన్న వైభవ్‌!

తన బౌలింగ్‌ గురించి వైభవ్‌ సరదాగా ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశాడు. ఇషాన్‌ కిషన్‌ తనకు బంతి ఇచ్చేటప్పుడు రిస్క్‌ తీసుకున్నానని భావించాడని.. అయితే తాను ‘వికెట్‌ టేకర్‌’నని కెప్టెన్‌కు తెలియదని చెప్పాడు.

అవకాశం వచ్చినప్పుడు బంతిని ఒకే ప్రాంతంలో పదే పదే పడేలా ప్రయత్నించానని వైభవ్‌ వివరించాడు. బ్యాటింగ్‌లో విఫలమైన తర్వాత బౌలింగ్‌లో జట్టుకు సహకరించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పాడు.

జింబాబ్వే పర్యటనలోనూ అదరగొట్టాడు..

దులీప్‌ ట్రోఫీకి ముందు వైభవ్‌ జింబాబ్వే పర్యటనలోనూ అద్భుతంగా రాణించాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో 151 పరుగులు చేసి భారత్‌ తరఫున సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 50.33 సగటుతో పాటు 196.10 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేశాడు.

ఎక్కువమంది చదివినది: IND vs SL: తప్పు చేశారు గంభీర్.. ఆ ఒక్కడికి చోటిచ్చి ఉంటే ఈజీగా గెలిచేవాళ్లు..!

ఇంగ్లండ్‌ పర్యటనలో అంతగా ప్రభావం చూపలేకపోయినప్పటికీ.. జింబాబ్వే సిరీస్‌లో వైభవ్‌ తన అసలు సత్తాను చూపించాడు.

ఇప్పుడు కెప్టెన్‌గా కొత్త పరీక్ష..

ఇప్పటివరకు వైభవ్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు నాయకత్వ బాధ్యత కూడా అతడి చేతుల్లోకి రావడంతో మరో కొత్త పరీక్ష ఎదురైంది.

ఈస్ట్‌ జోన్‌ ఇప్పటికే నార్త్‌ఈస్ట్‌ జోన్‌పై ఇన్నింగ్స్‌ 210 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్‌కు చేరింది. ఇప్పుడు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సెంట్రల్‌ జోన్‌తో తలపడుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..