
నేపాల్.. భూతల స్వర్గం లాంటి దేశం. చుట్టూ మంచు కొండలు.. స్వచ్ఛంగా ప్రవహించే హిమానీ నదాలు.. పర్యాటక ప్రాంతాలు.. ప్రకృతితో మమేకమైన జీవితాలు. ఆగస్టు 26 వరకు అక్కడ ఉన్న జీవిన చిత్రం. ప్రస్తుతం అక్కడున్న పరిస్థితులు చూస్తే.. ఒక్క రోజులో మానవ జీవితం ఎంత సులువుగా అతలాకుతలం అవుతుందో చెప్పే విధ్వంసక దృశ్యం కళ్లకు కనబడుతుంది.
ప్రళయం ఎప్పుడూ పెద్ద పెద్ద శబ్దం చేస్తూ రాదు.. నిశ్చబ్దంగా తుడిపెట్టేస్తుంది అని నేపాలీలో ఒక నానుడి ఉంది. అచ్చం అలాగే.. మంచు కొండల్లో నివసించే రసువా, నువకోట్, ధాడింగ్, గోర్ఖా, చిత్వాన్ తెగల జీవితాలను అల్లకల్లోలం చేశాయి నేపాల్ వరదలు.
నేపాల్ ఉత్తర సరిహద్దు నుంచి వచ్చిన ఆకస్మిక వరదలు.. పలు జిల్లాలను తుడిచిపెట్టేశాయి. నేపాల్ చైనా బార్డర్ లోని రసువా జిల్లాలో కస్టమ్స్ ఆఫీస్, స్యఫ్రుబేషి, తిమూరే, త్రిసూలి ప్రాంతాలు పూర్తిగా కొట్టతుకుపోయి.. మృతుల దిబ్బగా మారిపోయింది. గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి. వరద తాకిడికి నీటిలో తేలియాడే చేపల్లాగా నేపాలీల మృతదేహాలు కొట్టుకురావడం చూసీ జీర్ణించుకోలేని పరిస్థితి.
30 బ్రిడ్జీలు మాయం..
నేపాల్ లో సునామీ మాదిరిగా వచ్చిన జల ప్రళయంతో 30 బ్రిడ్జీలు కూలి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. 42 కిలోమీటర్ల మేరకు రోడ్లు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. మొత్తం 33 దేశాల నుంచి వచ్చిన 644 మంది పర్యాటకలు మిస్సయినట్లు నేపాల్ మీడియా వెల్లడించింది. అందులో 359 మంది మృతదేహాలను వెలికితీశారు. మరోవైపు ఈ ప్రళయంలో చైనాలో ముగ్గురు చనిపోయారని.. 500 మంది చనిపోయినట్లు చైనా ప్రకటించింది.
ఇంతటి విపత్తుకు కారణం ఏంటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే పెద్ద కొండ చరియ విరిగి నదికి అడ్డంగా పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. కొండ చరియ అడ్డు పడటంతో.. నీళ్లు చాలా వరకు స్టోరేజీ అయ్యి ఒక్కసారిగా డ్యామ్ పై పడినట్లు భావిస్తున్నారు. అయితే అది మంచు కరిగి హిమానీ నది ఉప్పొంగటంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇదే జరిగితే భవిష్యత్తులో వాతారణ మార్పులు, హిందు కుష్ హిమాలయ పర్వత ప్రాంత భవిష్యత్తు భయాందోళనకరంగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు.
13 నెలల్లోనే హిస్టరీ రిపీట్:
ఈ విపత్తుతో, కేవలం ఏడాది కాలంలోనే నేపాల్‌లోని రసువా జిల్లా ఒక వినాశకరమైన వరదతో ధ్వంసం కావడం ఇది రెండవసారి. 2025 జూలైలో, అదే ప్రాంతంలో సంభవించిన ఇలాంటి వరద రసువాగఢి సరిహద్దు కారిడార్‌ను తుడిచిపెట్టింది. ఆ తర్వాత ఉపగ్రహ చిత్రాలు, టిబెట్‌లోని ఒక హిమానీనద సరస్సు అకస్మాత్తుగా ఇంకిపోయిందని చూపించాయి. 2025 నాటి వరదలో కనీసం 11 మంది మరణించారు. దీంతో వంతెనలను ధ్వంసం అయ్యాయి.. ఇంధన మౌలిక సదుపాయాలు దెబ్బతినటమే కాకుండా.. చైనాతో సరిహద్దు వాణిజ్యానికి అంతరాయం కలిగించింది.
కేవలం 13 నెలల వ్యవధిలోనే చరిత్ర పునరావృతమైందని స్థానికులు చెబుతున్నారు. నేపాల్‌లోనే కాకుండా మొత్తం హిమాలయ ప్రాంతంలోనే గత 50 ఏళ్లలో సంభవించిన అతిపెద్ద మంచు సునామీ ఇదేనని త్రిభువన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రంజన్ కుమార్ దహల్ పేర్కొన్నారు. ఇది హిమనదీయ సరస్సు విస్ఫోటనం వల్ల వచ్చిన వరదా, కొండచరియలు విరిగిపడటం వల్ల సంభవించిన వరదా, లేక రెండింటి కలయికా అనేది పక్కన పెడితే, ఒక విషయం మాత్రం స్పష్టం.. ప్రమాదం పెరుగుతోంది, దీనివల్ల కలిగే నష్టం ఏ ఒక్క దేశానికో పరిమితం కాదని అంటున్నారు.
నేపాల్‌లోని భోటెకోషి నదిలో సంభవించిన ఆ వినాశకరమైన వరద, హిమాలయాల్లో జరిగిన ఒక భారీ భౌగోళిక సంఘటన ఫలితమేనని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన లామోంట్-డోహెర్టీ ఎర్త్ అబ్జర్వేటరీ భూభౌతిక శాస్త్రవేత్త గోరాన్ ఎక్‌స్ట్రోమ్ అంటున్నారు. హిమాలయ ప్రాంతంలో జరుగుతున్న వినాశకర ఘటనల పర్యవసానమే ఈ ఫలితంగా చెబుతున్నారు.
China-Nepal Border ! Before & After pic.twitter.com/rrEtq6Q2PI
— Navroop Singh (@TheNavroopSingh) August 28, 2026
నేపాల్ హిమాలయ ప్రాంతంలో 2 వేల 69 నుండి 2 వేల 174 హిమానీనద సరస్సులు ఉన్నాయి. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్‌మెంట్ (ICIMOD) ప్రకారం, వీటిలో 47 సరస్సులను ప్రమాదకరమైనవిగా వర్గీకరించారు. ఈ 47 హిమానీనద సరస్సులలో, 21 నేపాల్‌లో ఉండగా, 25 టిబెట్‌లోని సరిహద్దు సరస్సులలో ఉన్నాయి. ఇవి దక్షిణంగా నేపాల్‌లోకి ప్రవహించే నదుల ఎగువ ప్రాంతాలలో ఉన్నాయి. టిబెట్‌లో గానీ, నేపాల్‌లో గానీ ఉన్న ఈ సరస్సులలో ఏదైనా ఆకస్మిక వరదకు కారణమైతే, అది దిగువన నివసిస్తున్న నేపాల్ ప్రజలకు, మౌలిక సదుపాయాలకు హాని కలిగిస్తుంది.
హిందూ కుష్ హిమాలయ పర్వత శ్రేణి అంతటా, పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో హిమానీనదాలు కుంచించుకుపోతున్నాయి. సరస్సులు ఉప్పొంగుతున్నాయి. పర్వత లోయలు, వాలు ప్రాంతాలు మరింత అస్థిరంగా మారుతున్నాయి. హిమానీనద సంబంధిత విపత్తులు మరింత తరచుగా, మరింత సంక్లిష్టంగా మారుతున్నాయని ICIMOD పదేపదే హెచ్చరించింది.
ప్రస్తుతం సంభవించిన వరదకు వాతావరణ మార్పులే కారణమని చెప్పలేకపోతున్నారు. భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలకు ఈ ఘటన ఒక హెచ్చరికగా చెబుతున్నారు. కరుగుతున్న మంచు, అస్థిరమైన భూభాగం, కొండచరియలు విరిగిపడటం, నదులు అడ్డుపడటం, సరస్సుల నుంచి అకస్మాత్తుగా నీరు విడుదల కావడం, తీవ్రమైన వాతావరణం – ఇవన్నీ కలిసి అనూహ్యమైన రీతిలో సంభవించవచ్చునని చెబుతున్నారు. దిగువ ప్రాంతాలలో చేసే సంప్రదాయ వాతావరణ పర్యవేక్షణ ఇకపై సరిపోదని నిపుణులు చెప్పడం ఆందోళనకు గురిచేస్తోంది.
Shocking before & after footage of Nepal floods! 🏠⚠️ Watch how houses transformed and signs of life vanished in seconds under the roaring torrents.#NepalFloods pic.twitter.com/K7RXU9y08q
— Mohamed 🧣🍁 (@5G_VIDEO) August 27, 2026