
హైదరాబాద్, వెలుగు : ఏకాభిప్రాయం కుదరకపోవడం, నేతల మధ్య సయోధ్య లేకపోవడంతో పెండింగ్‌లో ఉన్న మండల, టౌన్, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం కోసం సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించారు.
ఈ నెల 31 లోపు పరిశీలకులు ఆయా మండల, టౌన్, డివిజన్లను సందర్శించి అక్కడ పార్టీ అధ్యక్షులను నియమించే బాధ్యత తీసుకోవాలంటూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ శుక్రవారం హైదరాబాద్ లో ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ కమిటీలు పెండింగ్ లో ఉన్న మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ అబ్జర్వర్లను నియమించారు.
ఇందులో కరీంనగర్, సిద్దిపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వరంగల్ ఈస్ట్, బాన్సువాడ, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పీసీసీ నియమించిన అబ్జర్వర్లలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి పీసీసీ పరిశీలకుడిగా ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, మహబూబ్ నగర్ అసెంబ్లీకి నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, శేరిలింగంపల్లి అసెంబ్లీకి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, వరంగల్ ఈస్ట్ కు ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కరీంనగర్ అసెంబ్లీకి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ను పరిశీలకులుగా నియమించారు.