
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ ఎయిర్ పోర్టులో విమానానికి పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం (ఆగస్ట్ 28) ఢిల్లీ నుంచి బిలాస్పూర్ వచ్చిన విమానం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతుండగా టైర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది. పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఈ ఘటనా సమయంలో విమానంలో 41 మంది ఉన్నారు. పైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
అధికారుల వివరాల ప్రకారం.. అలయన్స్ ఎయిర్‌కు చెందిన 9I613 విమానం శుక్రవారం (ఆగస్ట్ 28) ఉదయం ఢిల్లీ నుంచి బిలాస్ పూర్‌కు వచ్చింది. బిలాస్ పూర్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతుండగా విమానం లెఫ్ట్ టైర్ ఒక్కసారిగా పేలింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేశాడు.
అనంతరం ప్రయాణీకులు, సిబ్బందిని సురక్షితంగా రన్‌వే నుంచి టెర్మినల్ భవనానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు 37 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారని వెల్లడించారు. టైర్ బ్లాస్ట్ అనంతరం విమానం తదుపరి సర్వీసును రద్దు చేసి ప్రత్యేక బేకు తరలించారు. ఈ ఘటనపై నిపుణుల బృందం దర్యాప్తు చేపట్టింది. టైర్ బ్లాస్ట్‌కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.